కేంద్రం మరోసారి కొరడా ఝుళిపించింది. విద్వేషాల్ని రెచ్చగొట్టటం.. తప్పుడు సమాచారంతో దేశాన్ని అస్థిరపరిచే డిజిటల్ మీడియా సంస్థలకు చెక్ పెట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరి మీడియాకు అనుబంధంగా మారి.. ఇప్పుడు అదే ప్రధాన కంటెంట్ ప్రొవైడర్ గా మారిన సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దారుణాలతో ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి వాటి కోరలు పీకే విషయంలో ప్రభుత్వం అంత అప్రమత్తంగా ఉండేది కాదు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ.. అబద్ధం నిజంగా.. నిజం ఎవరూ పట్టించుకోని దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసత్యాలను.. విద్వేషాలను వ్యాప్తి చేసే వాటిపై కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్ర సమాచార ప్రసార శాఖ.
తాజాగా 35 యూట్యూబ్ చానళ్లపై వేటు వేసింది. అంతేకాదు.. రెండు వెబ్ సైట్లు.. మరో రెండు ఇన్ స్టా ఖాతాలతో పాటు రెండు ట్విటర్ ఖాతాలు.. ఒక ఫేస్ బుక్ అకౌంట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పాకిస్థాన్ నుంచి అపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాటి అకౌంట్లను వెంటనే బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ యూట్యూబ్ చానళ్లలో మొత్తం 1.20 కోట్ల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఈ వీడియోలకు మొత్తం 130 కోట్లకు పైగా వ్యూస్ ఉండటం గమనార్హం.
నిఘా వర్గాలు గుర్తించిన ఈ యూట్యూబ్ చానళ్లలో భారత సాయుధ దళాలు.. జమ్ముకశ్మీర్ తో పాటు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం లాంటి సున్నితమైన అంశాల విషయంలో తమ సొంత పైత్యాన్ని.. ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా.. విద్వేషాలు పెంచేలా చేయటంతో పాటు.. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేలా ఉండటం గమనార్హం. ఈ తరహాకు చెందిన కొన్ని యూట్యూబ్ చానళ్లను ఈ మధ్యనే బ్యాన్ చేశారు. తాజాగా మరో 35 యూట్యూబ్ చానళ్లను గుర్తించి.. వాటిపై చర్యలకు ఆదేశించారు. డిజిటల్ ప్రపంచాన్ని ఆసరాగా చేసుకొని పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఈ తరహా కుట్రకు బలమైన బదులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.