- కీలక విషయాల్లో హడావుడి నిర్ణయాలు
- చెల్లవని తెలిసీ తప్పుడు చట్టాలు
- న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు
- కేంద్రం నుంచి తిరుగు టపాలో బిల్లులు
- ఆపై గప్‌చుప్‌గా ‘రద్దు-ఉపసంహరణ’
- తాజాగా అమరావతి, మండలిపై అదే వైఖరి
‘నాయకుడు అనే వాడికి విశ్వసనీయత ఉండాలి’ ..సీఎం జగన్మోహన్రెడ్డి తన గురించి తాను గొప్పగా చెప్పుకొనే మాట.. ‘మా నాయకుడు మాట తప్పడు. మడమ తిప్పడు..’ అని వైసీపీ నేతలు పొద్దస్తమానం చేసే వ్యాఖ్యలు.. నిజానికి ఇవన్నీ వట్టివే. అవకాశం కొద్దీ మాట మడతేయడం.. అవసరమైన ప్రతిసారీ మడమ తిప్పడమే జగన్ నైజమని ఇప్పుడు స్పష్టమవుతోందని విపక్షాలు, విశ్లేషకులు అంటున్నారు.
వివిధ అంశాలపై తమ నేత పదేపదే మడమ తిప్పుతుండడంతో జనంలో నవ్వులపాలవుతున్నామని వైసీపీ నేతలే వాపోతున్నారు. మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని అనూహ్యంగా జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది.
ఆరునూరైనా రాష్ట్రానికి మూడు రాజధానులనూ నిర్మిస్తాం.. పాలనారాజధాని విశాఖకు తరలిపోతుందని ఊరూవాడా చాటాలని తమకు చెప్పి.. సీఎం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వైసీపీ నేతలు అంతుపట్టడం లేదు. ఆ మరుసటి రోజే శాసన మండలి రద్దుపైనా జగన్ పిల్లి మొగ్గ వేశారు. ‘మండలిలో త్వరలో మాకే మెజారిటీ వస్తుంది. అయినా… సరే రద్దు చేస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని నాడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇప్పుడు.. ఆయన ప్రభుత్వమే మాట మార్చేసి శాసనమండలి పునరుద్ధరణకు వీలుగా బిల్లు ఆమోదించింది.
ఇదొక్కటే కాదు.. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ అనేక అంశాలపై జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, లెక్కకు మించిన సలహాదారులు ఉన్నా కోర్టుల్లో సర్కారుకు తలబొప్పి కడుతూనే ఉంది.
హడావుడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా, చట్ట నిబంధనలను తుంగలో తొక్కడం.. కోర్టుల్లో చుక్కెదురు కావడం షరామామూలైంది. ఇక… శాసనసభ వేదికగానే ఆమోదించిన అనేక బిల్లులు, చేసిన చట్టాలూ అతీగతీలేకుండా పోయాయి. ప్రతి క్షణం ఓటుబ్యాంకుపై కన్నేసి.. పేరు గొప్పగా ప్రకటనలు చేయడం.. ఆ తర్వాత మాట మడతేయడం సీఎంకు అలవాటుగా మారింది. ఇలా మడమ తిప్పిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవీ..
అమరావతిపై పదేపదే…
విపక్షంలో ఉండగా జగన్ అమరావతికి మద్దతు పలికారు. అదే రాజధానిగా ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే దానిని అటకెక్కించారు. 2019 డిసెంబరు 19న మూడు రాజధానుల ప్రకటన చేశారు. 2020 జనవరిలో ఆ బిల్లులు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందారు. అదే ఏడాది జూలై 31న గవర్నర్ వాటిని ఆమోదించారు కూడా! ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును ‘రద్దు’ చేశారు. మళ్లీ సమగ్రంగా బిల్లులు ప్రవేశపెడతామంటున్నారు.
మండలిపై మాటమడత..
ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులకు అడ్డుతగులుతోందంటూ శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయించారు. 2020 జనవరి 27న శాసనసభలో తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానాన్ని వెంటనే కేంద్రం ఆమోదానికి పంపించారు. అప్పటికే ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా పనిచేస్తోన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లతో రాజీనామా చేయించి.. వారిని రాజ్యసభకు పంపించారు. మండలిపై అప్పటి వేడి మొత్తం ఇప్పుడు చల్లారి పోయింది. మండలిలో తమకు మెజారిటీ రాగానే… రద్దు అన్నదే ముద్దయింది.
ఎస్ఈసీపై గజిబిజి
స్థానిక ఎన్నికలను కరోనా కారణంగా వాయిదావేసినందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై కత్తికట్టారు. ఆయనను ఇంటికి పంపేందుకు ఏకంగా పంచాయతీరాజ్ చట్టంలో అడ్డగోలుగా సవరణలు తీసుకొచ్చి.. పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. కానీ రాత్రికి రాత్రే 77 ఏళ్ల రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. చివరకు అది న్యాయపరిశీలనలో వీగిపోయింది. ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో మళ్లీ నిమ్మగడ్డే ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఈ పోరాటంలో గెలిచిన నిమ్మగడ్డ తన పదవీకాలం పూర్తయ్యేవరకు సేవలందించారు.
అసైన్డ్ భూములపై అయోమయం
పేదలకు సాగుభూములు, ఇంటి స్థలాలను కేటాయించాలంటే ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టప్రకారం నడుచుకోవాలి. స్థలాలను డీకేటీ పట్టాల రూపంలోనే ఇవ్వాలి. అయితే జగన్ సర్కారు పేదలకు కన్వేయెన్స్ డీడ్ రూపంలోనే ఇంటిపట్టాలు ఇస్తామంటూ జీవోలు జారీ చేసింది. ఇది కుదరదని హైకోర్టు తేల్చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కేసు ఎంతకూ విచారణకు రాలేదు.
మరోవైపు.. అసైన్డ్ ఇంటి స్థలాలను 20 ఏళ్లపాటు అమ్ముకోవడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారే ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అమల్లో ఉండగానే కన్వేయెన్స్ డీడ్లు ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే నీళ్లు నమలాల్సిందే. దీంతో సర్కారు ఆ కేసు విచారణలో ఉండగానే పాత పద్ధతిలో.. ఏపీ అసైన్మెంట్ చట్టం-1977 ప్రకారం డీకేటీ పట్టాల రూపంలోనే ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసింది.
దిశ లేని దిశ..
మహిళలపై అత్యాచారాలు చేసేవారిని ఉరితీస్తామంటూ.. 2019 డిసెంబరు 13న అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ఆమోదించారు. 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం, దోషులను ఉరి తీయడం… ఇందులో ముఖ్యాంశాలు. సర్కారు ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, కేంద్ర చట్టాలను తోసిరాజనేలా సొంతంగా చట్టాలు చేయడమే అసలు సమస్య! దీంతో… ‘దిశ’ బిల్లును కేంద్రం ఆమోదించకుండా తిప్పి పంపించింది.
దిశ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కూడా తిరుగు టపాలో వచ్చేసింది. దీంతో ఈ బిల్లులను గత ఏడాది డిసెంబరులో ఉపసంహరించుకున్నారు. వాటికి స్వల్పమార్పులు చేసి.. మళ్లీ కేంద్రానికి పంపించారు. 11 నెలలుగా దీనిపై కేంద్రంలో దీనిపై కదలికే లేదు.
అంతుచిక్కని ‘టైటిల్’
దేశంలోనే అందరికంటే ముందు భూములకు శాశ్వత టైటిల్ ఇస్తామని, దీని ఆధారంగా సర్వే కూడా చేస్తామని 2019 జూలై 30న ఏపీ ల్యాండ్ టైటిల్ బిల్లును ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించారు. అనేక కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఆ బిల్లు ఉందని తేలింది. దీంతో గత ఏడాది డిసెంబరులో ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. దీనికి మార్పులు చేసి 2020 డిసెంబరు 4న మరో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఇప్పటికే 11 నెలలవుతోంది. ఆ బిల్లులోని అంశాలు పార్లమెంటు చేసిన చట్టాలకు పోటీగా ఉన్నాయంటూ కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేదు.
విద్యాదీవెనపై హైకోర్టులో ఝలక్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పేరుమార్చి జగనన్న విద్యాదీవెన అని జగన్ తన పేరే పెట్టుకున్నారు. రీయింబర్స్ చేసే మొత్తాన్ని కాలేజీలకు గాకుండా.. పిల్లల తల్లుల ఖాతాల్లో వేసే పథకమిది. ఖాతాల్లో పడిన సొమ్మును వారం పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి చెల్లించాలన్నారు. వారు ఆ డబ్బు ఖర్చుపెడితే కాలేజీల ఫీజు సంగతేంటి? యాజమాన్యాలు పిల్లలను పరీక్షలకు అనుమతించకపోతే.. ఫీజుల కోసం సతాయిస్తే ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. దీనిపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కాలేజీల ఖాతాల్లోనే డబ్బులు వేయాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ముందు అప్పీలు చేసింది. దానిని ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది.