దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50ఏళ్లుగా నిరంతరం వెలిగిన `అమర జవాను జ్యోతి` ఈ రోజు ఆరిపోనుంది. దీన్ని జాతీయ యుద్ధ సార్మకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు గుర్తుగా అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు.
అమర జవాను జ్యోతిని.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిర్వహణ కష్టతరం కావడం వల్ల రెండింటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున ప్రత్యేక జ్యోతి ఎందుకన్న వాదన ఉన్నట్లు సైనికవర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు తప్పుబట్టారు.
నిర్వహణ కష్టతరం కావడం వల్ల రెండింటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్ చీఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో జరిగే కార్యక్రమంలో అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో కలపనున్నారు.
అమర జవాన్ల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున ఇండియా గేట్ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకన్న వాదన ఉన్నట్లు సైనికవర్గాలు పేర్కొన్నాయి. 1947-48 పాకిస్థాన్ యుద్ధం మొదలుకొని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల వరకు అందరి పేర్లు జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్నాయని గుర్తుచేస్తున్నాయి.
అయితే, ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు ఆరోపోవడం విచారకరమని అన్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమర జవాను జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని భరోసా ఇచ్చారు.