ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీల నాయకులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఎన్నికల్లో విజయం కోసం నానా హంగామా చేస్తారు. కార్యకర్త నుంచి మొదలు పార్టీ అధ్యక్షుడి వరకూ అందరూ రణరంగంలో దిగిపోతారు. ఇక పార్టీ అగ్రనేతలైతే వ్యూహాలు, ప్రణాళికల్లో మునిగిపోయి జట్టు విజయం కోసం కృషి చేస్తారు. త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ.. పంజాబ్‌లో మళ్లీ గెలవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నెగ్గేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మధ్యలో ఆప్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు పాగా వేసేందుకు పావులు కదుపుతున్నాయి.
ఇలా పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి విజయం కోసం కష్టపడుతున్నాయి. ఆ పార్టీల నేతలు కూడా సమరానికి సై అంటున్నారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యవహార శైలి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి కీలకమైన సమయంలోనూ ఆయన ఎన్నికల సవాల్ నుంచి తప్పించుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కష్టపడితే మరోసారి అక్కడ పార్టీకి అధికారం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆ రాష్ట్రంలో బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా మీనమేషాలు చూస్తోందని టాక్. అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా తప్పించి చరణ్‌జీత్ సింగ్ చన్నీకి ఆ బాధ్యతలు కట్టబెట్టడంతో పార్టీలో మొదలైన లుకలుకలు ఇంకా ముగియలేదు. వాటిని సరిదిద్దాల్సిన రాహుల్ గాంధీ అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ప్రస్తుత సీఎం చరణ్జీత్లో ఎవరికి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే విషయంలో పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విభేదాలకు ముగింపు పలికి పార్టీని కలుపుకోని పోవాల్సిన రాహుల్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారని టాక్.
మరోవైపు ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీని గెలిపించే బాధ్యతను తన సోదరి ప్రియాంక గాంధీపై రాహుల్ తోసేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఆ రాష్ట్రం ఎంతో కీలకమని తెలిసినా అక్కడ పార్టీ విజయం దిశగా రాహుల్ ఎలాంటి కసరత్తులు చేయడం లేదని అంటున్నారు. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవడం అక్కడ బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంటే.. రాహుల్ మాత్రం కిమ్మనడం లేదని టాక్. ఎన్నికల్లో పార్టీ గెలిపించుకునే ప్రయత్నాలు కూడా చేయనంత బిజీగా రాహుల్ ఉన్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.