చాలామంది నేతలకు లేని కుటుంబ నేపధ్యం ఉంది. తన తండ్రి చనిపోయి దాదాపు 30 ఏళ్ళవుతున్నా ఇంకా ఆయనపై జనాల్లో అభిమానం ఉంది. ఇన్ని ఉండి కూడా ఈ యువనేత రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. కారణం ఏమయ్యుంటుంది ? అన్నదే చాలామందికి అర్ధం కావటం లేదు. ఇదంతా ఎవరి గురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును అయనే వంగవీటి రాధాకృష్ణ.
నిజానికి రాజకీయాల్లో నిలదొక్కుకోవటానికి చాలామందికి దొరకని బలమైన లాంచింగ్ ప్యాడ్ తండ్రి వంగవీటి రంగా రూపంలో రాధాకు దొరికింది. వంగవీటి రంగా అంటే కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటికీ బాగా పాపులరనే చెప్పాలి. రంగా చనిపోయి సుమారు 30 ఏళ్ళయిపోయినా ఇంకా రంగాను తలచుకుంటునే ఉంటారు. పైగా కాపు సామాజికవర్గంలో రంగా అంటే ఓ బాహుబలి క్రిందే ఆరాధిస్తారు.
అలాంటి రంగాకు కొడుకైన రాధా మాత్రం రాజకీయంగా నిలదొక్కుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. 2004లో ఒక్కసారి మాత్రమే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచారంటేనే అర్ధం చేసుకోవచ్చు రాధా పరిస్దితేమిటో. ఇంతటి బలమైన లాంచింగ్ ప్యాడ్ పెట్టుకుని కూడా రాధా రాజకీయాల్లో ఎందుకు రాణించటం లేదు ? అన్నదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇతర పార్టీలు, కాపుల్లోనే కొందరు చెప్పే సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇంతకీ ఆ కారణాలు ఏమిటంటే రాధాకు బాగా బద్దకం ఎక్కువట. సీరియస్ రాజకీయాల్లో ఎప్పుడూ రాధా వెనకబడే ఉంటారట. నిలకడలేమి కూడా చాలా ఎక్కువనే అంటారు. ఏ విషయం మీద కూడా నిలకడగా ఉండటం రాధాకు సాధ్యంకాదట. వైసీపీలో కీలక నేతగా ఉన్నసమయంలో కూడా టీడీపీ ప్రభుత్వంపై ఏనాడు ఉద్యమం చేసింది లేదట. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చినా రాధా మాత్రం ఆందోళనల్లో పాల్గొన్నది చాలా తక్కువే అంటారు.
అలాగే ఏపార్టీకి లాయల్ గా ఉండే అలవాటు కూడా రాధాకు లేదట. ముందు కాంగ్రెస్ అన్నారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు. మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీకి దూరంగా జరిగి జనసేన నేతలతో చట్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత బీజేపీతో కూడా మంతనాలు జరిపారు. హోలు మొత్తం మీద ఇపుడు రాధా ఏ పార్టీలో ఉన్నారో ఎవరు చెప్పలేకున్నారు. కాకపోతే తాజాగా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు కాబట్టి టీడీపీలోనే ఉన్నారని అనుకుంటున్నారు. మరి తన భవిష్యత్తుపై రాధాకైనా స్పష్టమైన ప్లానింగ్ ఉందో లేదో చూడాలి.