తీరు మారలేదు... దిశ వాహనాలకు వైసీపీ రంగులు !!

ఏపీలో జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బొమ్మ మాత్రం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది. దీంతో, ఆ రంగులు తొలగించి కేవలం తెలుపు రంగు మాత్రమే వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఆ ఎపిసోడ్ నుంచి జగన్ సర్కార్ అనుభవం సంపాదించలేదన్న సంగతి తాజాగా మరోసారి రుజువైంది.

తాజాగా, వైసీపీ సర్కార్ మరోసారి రంగుల చిక్కుల్లో పడింది. తాజాగా దిశ పోలీసు వాహనాలకు నీలం, ఆకుపచ్చ రంగుల్ని వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై  టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి ఘరానా మోసం చేశారని, అయినా పోలీసు వాహనాలకు వైసీపీ రంగులేయడం ఏమిటని లోకేష్ మండిపడ్డారు.

తాజాగా గుంటూరు పోలీసులు దిశ టీమ్స్‌కు టూ వీలర్ వాహనాలు ఇచ్చారు. వాస్తవానికి అవి పాత వాహనాలు. అయితే, వాటికి వైసీపీ రంగులేసి..కొత్త మేకప్ తో షీ టీమ్స్‌కు అప్పజెప్పారు. ఇంతా చేస్తే, ఆ వాహనాలలో కొన్ని స్టార్ట్ కాలేదు. అయితే, వాహనాల అందజేత ప్రోగ్రామ్ ను అట్టహాసంగా నిర్వహిస్తూ పోలీసులు రికార్డ్ చేసిన వీడియో బయటకు వచ్చింది.

దీంతో, పోలీస్ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై నారా లోకేష్ మండిపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోలీస్ వాహనాలకు వైసీపీ రంగులు వేయడం ఏమిటని... పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారని లోకేష్ విమర్శించారు. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైసీపీ రంగులోకి మార్చేసేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

రంగులతో మహిళలకు రక్షణ రాదని, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకి రాగలుగుతారని లోకేష్ ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైసీపీ రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిదని లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి, గతంలో రంగులపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గుంటూరు పోలీసులు దిశ వాహనాలపై రంగులు తొలగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.