ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటన పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పియారియానా గ్రామ సమీపంలో 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే మోదీ కాన్వాయ్ నిలిచిపోవడం పంజాబ్ ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తోంది. అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పంజాబ్ పోలీసులు కేంద్రబలగాలకు సహకరించారని, ప్రధాని భద్రత బాధ్యత సెంట్రల్ ఏజెన్సీలదేనని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది.
అయితే, మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. లఖీంపుర్ ఘటనకు నిరసనగా ప్రధాని పర్యటనలో నిరసన తెలిపేందుకు ఫ్లైఓవర్ పైకి వచ్చామని తెలిపారు. మరోవైపు, ప్రధానిని ఫ్లైఓవర్‌పైనే 20 నిమిషాల పాటు ఆపడానికి కారణాలేంటో చెప్పాలని, పంజాబ్ సర్కార్‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది.
అయితే, రైతులు ఆ ప్రాంతంలో ఏడాదిగా నిరసన తెలుపుతున్నారని, మోదీ పర్యటనకు ముందు రోజు రాత్రి వారితో తాము మాట్లాడి పర్యటనను అడ్డుకోవద్దని చెప్పామని పంజాబ్ సీఎం చన్నీ అన్నారు.జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నామని, ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే, మోదీపై దాడి చేయాలనే ఆలోచన గాని, అలాంటి పరిస్థితులు గాని అక్కడ జరగలేదని వివరణ ఇచ్చారు.
కానీ, మోదీ ఫ్లై ఓవర్ మీదకు రాగానే హఠాత్తుగా రైతులంతా ఒక్కసారిగా నిరసన తెలిపేందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరణనిచ్చారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దంటూ విపక్షాలకు హితవు పలికారు. మరోవైపు, తనను ప్రాణాలతో ఎయిర్ పోర్టుకు పంపించిన చన్నీకి ధన్యవాదాలు తెలపాలంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
పాక్ బోర్డర్ కు పది కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడంపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మండిపడ్డారు. చన్నీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అయితే, మోదీ సభకు 70 వేల మంది వస్తారని ఆశించగా…కనీసం 1000 మంది కూడా రాకపోవడంతోనే టూర్ రద్దయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.