తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రాధా చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భయపడనని, ప్రజా జీవితంలోనే ఉంటానని రాధా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వంగవీటి రంగా ఆశయ సాధనే తన లక్ష్యమని, దానికోసం పోరాడుతూనే ఉంటానని రాధా వ్యాఖ్యానించారు..
అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని, తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని రాధా చెప్పారు. రాధా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. దీంతో, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో, రాధా హత్యకు రెక్కీ చేసినవారెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని జగన్ ఆదేశించారని నాని చెప్పారు. అంతేకాదు, రాధాకు 2 ప్లస్ 2 విధానంలో గన్ మన్లను ఏర్పాటు చేయాలని జగన్ చెప్పినట్లు నాని వెల్లడించారు.
ఇక, వంగవీటి రాధా వైసీపీలో చేరే విషయం తమ మధ్య చర్చకు రాలేదని కొడాలి నాని అన్నారు. రాధా ఎప్పుడు పార్టీలో చేరతానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతానని నాని తెలిపారు. అయితే, రాధా కామెంట్స్ వ్యూహాత్మకమా.. లేక రాజకీయపరమైనవా…అన్నది తేలాల్సి ఉంది. ఇక, రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంని రాధా బరిలో దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కడ ఆల్రెడీ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న దేవినేని అవినాష్ కూడా అదే టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంంలోనే రాధా రెక్కీ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.