దేశవ్యాప్తంగా చలి పలు ప్రాంతాల్లో చలి గాలులు పెరిగాయి. దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. రాజస్థాన్లోని చురు లో -1.1 డిగ్రీల సెల్సియస్, ముస్సోరీలో -2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. పొగమంచుకు చల్లటి గాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. మినుములూరులో 8 డిగ్రీలకు పడిపోయింది. లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, తెలంగాణలో కొమురం భీమ్ జిల్లా గిన్నెధరిలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 6.1, బజార్ హత్నూర్ లో 6.1, వాంకిడిలో 6.11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి వీచే చలి గాలులు ఈ ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంటోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువ లేదా 4.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల వరకు నమోదైనపుడు కోల్డ్ వేవ్ గా గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. పశ్చిమం నుంచి వీచే గాలుల వల్ల కూడా కోల్డ్ వేవ్ వస్తుందని, భారత్ లో కోల్డ్ వేవ్ ముప్పు తప్పదని తెలిపారు. ఉత్తర భారత్ లో శీతల పవనాలు పెరగడం కూడా ఒక కారణమంటున్నారు. రాబోయే 3 నెలల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు.