మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క మోడల్ కు మిస్ యూనివర్స్ కావాలన్నది ఓ కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు లక్షలాది మంది మోడళ్లు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తుంటారు. అయితే, విశ్వ సుందరి కావడానికి అందంతో పాటు కాసింత అదృష్టం…మరికొంత ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. అలా అందం, అభినయం, అదృష్టం, ఆత్మవిశ్వాసం ఉన్నవారికే ఆ ప్రతిష్టాత్మక కిరీటం దక్కుతుంది.
ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే…భారతీయ యువతి హర్నాజ్ సంధు `మిస్ యూనివర్స్-2021` కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయెల్ లోని ఇల్లియాట్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో విజయం సాధించి నయా విశ్వ సుందరిగా ప్రశంసలందుకుంటోంది. ఎందరో అందగత్తెలను వెనక్కు నెట్టిన ఈ 21 ఏళ్ల పంజాబీ అమ్మాయి విశ్వ సుందరి-2021 టైటిల్ ను ఎగరేసుకుపోయింది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని ధరించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ చరిత్రపుటల్లో నిలిచింది.
హర్నాజ్ కు మిస్ యూనివర్స్-2020 ఆండ్రియా మెజా (మెక్సికో) విశ్వ సుందరి కిరీటాన్ని అలంకరించారు. హర్నాజ్ కంటే ముందు భారత్ రెండు సార్లు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. 1994లో తొలిసారిగా బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ భారత్ నుంచి ఈ కిరీటం సాధించింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో భారత్ నుంచి మరో బాలీవుడ్ నటి లారాదత్తా ‘మిస్ యూనివర్స్’గా నిలిచింది. తాజాగా 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ టైటిల్ను పంజాబ్ యువతి హర్నాజ్ సంధు గెలుచుకొంది.