మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తు నరేంద్రమోడి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఏడాదిక్రితం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను మోడి సర్కార్ చేసింది. దాదాపు ఏడాదిగా జరుగుతున్న ఉద్యమసెగ నరేంద్రమోడికి బాగా తగిలినట్లే అర్ధమవుతోంది.
వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో ఎంత గోల జరిగినా ఎవరినీ లెక్కచేయకుండా మోడి ప్రభుత్వం చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతాంగానికి తీరని నష్ట జరుగుతుందని రైతుసంఘాలు ఎంత మొత్తుకున్న మోడి పట్టించుకోలేదు.
వేరేదారి లేక చివరకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన మొదలైంది. ముందు పంజాబ్ లో మొదలైన వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం మెల్లిగా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు కూడా పాకింది. దాంతో మూడు రాష్ట్రాల్లోని రైతుసంఘాలు కలిసి భారతీయ కిసాన్ సంఘ్ గా రూపాంతరం చెంది ఉద్యమం మొదలుపెట్టింది. ఢిల్లీ శివార్లలని సింఘూ ప్రాంతంలో గడచిన 11 మాసాలుగా వేలాదిమంది రైతులు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
రైతుల ఉద్యమాన్ని నిలిపేందుకు సుప్రింకోర్టు కూడా జోక్యం చేసుకున్నది. కేంద్రం-రైతులకు మధ్య సయోధ్య కుదర్చటానికి ప్రత్యేకంగా నిపుణుల కమిటిని కూడా వేసింది. అయితే ఆ కమిటి ఇపుడేమీ చేస్తోందో ఎవరికీ తెలీదు.
సుప్రింకోర్టు సూచించినా వ్యవసాయ చట్టాల రద్దుకు మోడి సర్కార్ అంగీకరించలేదు. దాంతో రైతుల ఉద్యమం రోజురోజుకు పెరుగుతోందే కానీ ఏమాత్రం తగ్గటంలేదు. ఇదే సమయంలో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతుల సంఘాలు ప్రచారంచేశాయి.
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కిసాన్ సంఘ్ పెద్దఎత్తున మోడి వ్యతిరేక ప్రదర్శనలు, సభలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తొందరలోనే మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి.
రైతు ఉద్యమం వల్ల ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి తీరని నష్టం జరగబోతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మోడిలో టెన్షన్ మొదలైనట్లే ఉంది. అందుకనే హఠాత్తుగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడి ప్రకటించారు.
మోడి తాజా వైఖరిని గమనిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఎంతటి టెన్షన్లో ఉన్నారో అర్ధమైపోతోంది. లేకపోతే ఎవరెన్ని రకాలుగా ఎంతకాలం చెప్పినా మాట వినని మోడి హఠాత్తుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారంటే రాజకీయంగా జరగబోయే నష్టాన్ని గుర్తించటమే ప్రధాన కారణమని చెప్పాలి.
కొత్త వ్యవసాయ చట్టాలను మోడి కేవలం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలమని కిసాన్ సంఘ్ చేసిన ఆరోపణలు గమనార్హం. నెలల తరబడి చేస్తున్న ఉద్యమంలో ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు చనిపోయారు. అలాంటిది ఇపుడు రైతులకు మోడి క్షమాపణ చెప్పటం వల్ల ఏమి ఉపయోగం ?