సీరియస్ గా మాట్లాడుతూ కూడా జోకులేయటం బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకే చెల్లింది. మీడియాతో మాట్లాడుతూ రెండు విషయాలపై జోకులేశారు. అవేమిటంటే జనసేనతో పొత్తుల వ్యవహారం, బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలపైన. మొదటి విషయాన్ని తీసుకుంటే జనసేన తో తప్ప తమకు మరే పార్టీతోనూ పొత్తు అవసరం లేదని చెప్పేశారు. అసలు బీజేపీ+జనసేనలు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాయా ? అనే అంశంలో ఎవరికీ క్లారిటీ లేదు.
మిగిలిన పార్టీలు, జనాల సంగతిని పక్కన పెట్టేసినా పై రెండు పార్టీల నేతల్లోనే పొత్తుల విషయమై సరైన క్లారిటీ లేదు. బీజేపీతో అధికారికంగా పొత్తున్నా కొన్ని చోట్ల జనసైనికులు టీడీపీతో కలిసి నడుస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఇదే సమయంలో పొత్తున్న కమలనాథులతో కలిసి నడవడానికి మాత్రం జనసేన నేతలు ఇష్టపడటంలేదు. మరిలాంటి నేపథ్యంలో తమకు జనసేనతో తప్ప వేరే వారితో పొత్తు అవసరం లేదని అనుకున్నంత మాత్రాన అది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు.
ఈ మధ్యనే జరిగిన పరిషత్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన ఎక్కడా కలిసి పనిచేయలేదు. పైగా 8 మండలాల్లో పరిషత్ అధ్యక్ష, ఉపాధ్య పదవులను జనసేన-టీడీపీలు కలిసి పంచుకున్నాయి. ఈ విషయమై ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ అటు వీర్రాజు కానీ ఏ విధంగాను క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో జనసేన+టీడీపీలు కలిసే నడుస్తున్నాయి. ప్రచారాన్ని రెండు పార్టీల నేతలు జాయింటుగానే చేస్తున్నారు.
ఇక బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ పోటీచేసినా జనసేన ప్రచారానికే రాలేదు. ఎన్నిసార్లు అడిగినా పవన్ అసలు అడుగే పెట్టలేదు. పైగా స్వేచ్చగా ఎన్నిక జరిగుంటే బీజేపీనే బద్వేలులో గెలిచేదని వీర్రాజు జోకేశారు. 281 పోలింగ్ కేంద్రాల్లో 10 చోట్ల కూడా పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోలేని కమలం పార్టీ బద్వేలులో తమ పార్టీయే గెలిచేదని చెప్పుకోవటంకన్నా పెద్ద జోకేముంది. 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి వచ్చిన ఓట్లు 735 మాత్రమే. అలాంటిది ఇపుడు 21 వేల ఓట్లు వచ్చాయంటే అదంతా తెలుగుదేంపార్టీ పుణ్యమే అని అందరికీ తెలిసిందే. టీడీపీ లేకపోతే డిపాజిట్లు కూడా తెచ్చుకునేంత సీన్ లేని పార్టీ గెలుపు తమదే అని చెప్పుకోవటం కన్నా పెద్ద జోకుందా.
ఇక పొత్తుల విషయాన్ని తీసుకుంటే బీజేపీకి జనసేన తప్ప మరో దిక్కేలేదు. అందుకనే జనసేన తమను కాదని టీడీపీతో అడుగులేస్తున్నా ఏమీ మాట్లాడలేని స్ధితిలో ఉన్నారు వీర్రాజు. అయితే, జనసేన లేదంటే టీడీపీ తప్ప కాంగ్రెస్ లేకపోతే వామపక్షాలతోనో అదీ కాకపోతే వైసీపీతోనో పొత్తు పెట్టుకోలేరు కదా. మరిక వీర్రాజుకు మిగిలిన ఆప్షన్ ఏముంది జనసేన తప్ప. ఎందుకంటే వీర్రాజు చంద్రబాబు అంటే గతంలో పొత్తులో ఉన్నప్పటి నుంచే మంట. ఇది బహిరంగం.