సీఎం జగన్ ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తనను, తన తల్లిని దూషించారని, అందుకే తన అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపై దాడి చేశారని స్వయంగా జగన్ ఒప్పుకున్నారు. ఇక, టీడీపీ పై జరిగిన దాడిని సమర్థించిన జగన్…తనకు ఘోర అవమానం జరిగిందంటూ సింపతీ కొట్టేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన తల్లిని దూషించారని చెప్పి సానుభూతి పొందాలనుకున్న జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు, పట్టాభి తిట్టింది జగన్ను కాదని.. సజ్జలను అని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కానీ, సానుభూతి కోసం పట్టాభి తననే అన్నారని ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
ఓట్లు, సీట్లు వస్తాయని తెలిసిన జగన్….గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి ఘటన వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పట్టాభి తిట్టిన బోసిడీకే అన్న పదాన్ని జగన్ తనకు అన్వయించుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. బోసిడీకే అటే పెద్ద తిట్టు కాదని, తెలంగాణలో బోసిడీకే అంటే ‘పాడైపోయిన’ అని అర్థం వస్తుందన్నారు.
ఆ పదానికి పెడర్థాలు తీసిన జగన్…తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డుకు తెర తీశాడని ఆరోపించారు. తల్లిపై జగన్కు నిజంగా ప్రేమ ఉంటే తల్లిని తిట్టిన వారికి మంత్రి పదవి ఇవ్వడని బొత్స సత్యన్నారాయణనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లిపై, చెల్లిపై జగన్ కు అంత ప్రేమ ఉంటే ..వారిని తెలంగాణ రోడ్లపై అనాథగా వదిలేయడని అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.