ఏమాటకు ఆ మాటే. మనోడు మనోడే. పక్కింటోడు పక్కింటోడే. తోడబుట్టిన వాడైనా.. ఒకదశ దాటిన తర్వాత వాటి కుటుంబం వాడిది.. మన కుటుంబం మనది అవుతుంది. తోడబుట్టినోడి దాకా ఎందుకు.. మన ఇంట్లో మన పిల్లల్నే తీసుకుందాం. పెళ్లికి ముందు వరకు ‘మన’ ఇల్లు కాస్తా.. పెళ్లి తర్వాత ‘మా’ ఇల్లు అవుతుందే తప్పించి.. అప్పటికి మన ఇల్లు అన్న మాట చాలా చాలా తక్కువ మందిలో వినిపిస్తుంది.
అంతేకాదు.. అప్పటివరకు అమ్మా.. నాన్న అన్న వారే ప్రపంచంగా ఉన్నోళ్లకు పెళ్లి తర్వాత.. నా ఇల్లు.. నా భర్త.. నా పిల్లలు అంటూ పరిధి పెరగటమే కాదు.. వారి ప్రాధాన్యతల్లో వచ్చే మార్పు అందరికి తెలిసిందే. వ్యక్తిగా ఉన్న చిన్న అంశాల్లోనే ఇంతలా ఉన్నప్పుడు.. పెద్ద పెద్ద విషయాలు మరెంత సంక్లిష్టంగా ఉంటాయి.
రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండాలా? అంటే అవును..కాదనే రెండు వాదనలు బలంగా వినిపిస్తుంటాయి. సిద్దాంతాలు మంచిదే. కానీ.. మారిన కాలానికి తగ్గట్లు మారకుంటే.. కాలంలో కలిసి పోవటం ఖాయం. మామూలు ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ లోకి మారే విషయంలో నోకియా చేసి తప్పుతో ప్రపంచానికి జరిగిన నష్టం ఏమీ లేదు. ఆ కంపెనీనే తీవ్రంగా నష్టపోయిందన్నది మర్చిపోకూడదు.
అలానే పార్టీలకు సొంత మీడియా అవసరం తాజాగా జరగుతున్న పరిణామాలతో మరింత బాగా అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. సొంత మీడియా ఉంటే ఆ లెక్కే వేరన్న మాట తెలుగు తమ్ముళ్లు ఎంతలా మొత్తుకున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు ససేమిరా అంటారు.
ఈ వాదనకు ఆయన ప్రత్యర్థులు ‘పచ్చ’ మీడియా ఉందిగా అంటూ ఎటకారం ఆడేస్తారు. అది వేరే వాళ్లు వేసిన ముద్ర మాత్రమే. వారు వైఎస్ కి జగన్ కి వ్యతిరేకమే గాని బాబకు అనుకూలం కాదు. అపుడపుడు అనుకూలంగా రాసినా దాని కంటూ కొన్ని లెక్కల్లోనే పని చేస్తాయే తప్పించి.. మిగిలిన రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా సంస్థలు తెగించిన రీతిలో అయితే తమ వాదనను వినిపించవు కదా?
అయినప్పటికి చంద్రబాబు మాత్రమే కాదు పవన్ కల్యాణ్ సైతం.. సొంత పార్టీ అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది వారిని దారుణంగా దెబ్బ తీస్తుందని చెప్పాలి. మొన్న పవన్ కల్యాణ్ ఆవేశంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి నచ్చని రాజకీయ పార్టీలకు చెందిన మీడియా సంస్థల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో తెలిసిందే.
మరి.. పవన్ మాటలకు కొనసాగింపుగా పోసాని చేస్తున్న వ్యాఖ్యలకు.. అదే మీడియా సంస్థలు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత అన్నది చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. అంటే.. తమకు అనుకూలంగా లేని వాటిని నిర్దాక్షిణ్యంగా పరిహరించే పార్టీల సొంత మీడియా సంస్థలకు.. అనుకూల మీడియాకు ఉన్న తేడా అదే.
తాము అభిమానించి.. ఆరాధించే పార్టీలకు ఎంత డ్యామేజ్ జరిగేదైనా సరే.. పచ్చ మీడియాగా ముద్ర పడిన వారు తప్పనిసరిగా టెలికాస్ట్ చేయాలి.. ప్రింట్ చేయాలి. కానీ.. అలాంటి లెక్కలేవీ.. సొంత పార్టీ మీడియా సంస్థలు ఉన్న వారు పాటించరు. ఇలాంటప్పుడు చంద్రబాబుకు అండగా ఉంటుందని చెప్పే అనుకూల మీడియాకు.. మిగిలిన పార్టీలకు చెందిన మీడియా సంస్థలకు ఉన్న తేడా అన్నది గుర్తించాలి.
ఇక.. పవన్ కల్యాణ్ కు అటు జగన్ వ్యతిరేక మీడియాతో పాటు.. ఇటు పార్టీలకు చెందిన మీడియా సంస్థలు కూడా దన్నుగా నిలవవు. ఈ కారణంతోనే ఆయన తన వాదనను వినిపించుకోలేరు. అలా అని సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవటానికి సంసిద్ధంగా ఉండరు.
జగన్ వ్యతిరేక మీడియా ఉన్నప్పటికి తనదైన సొంత మీడియా లేని చంద్రబాబు.. ఏ మీడియా సంస్థకు దత్తపుత్రుడు కాని పవన్ కల్యాణ్ కు సొంతం లేని లోటు షాకులు ఇస్తుందనే మాట వినిపిస్తోంది. మరి.. ఈ లోటును ఈ ఇద్దరు అధినేతలు ఎప్పుడు గుర్తిస్తారో?