ఏపీ రాజకీయాల్లో పార్టీలకు స్పేస్ ఉంది. కానీ వాడుకోవాలని చాలామందికి ఉంది. ఏపీలో పార్టీలు నడపడం ఇతర రాష్ట్రాల్లో నడిపినంత సులువు కాదు.
అందుకే ఏపీలో రాజకీయ నాయకత్వం అంటే అతి ఖరీదైన కుల రాజకీయం. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని వ్యక్తి రాజకీయ పార్టీ పెడతాను అంటూ ముందుకు వచ్చారు.
ఆయన ఎవరో కాదు, కరోనా మందును తయారుచేసిన ఆనందయ్య.
వైసీపీ వ్యవహారంతో విసిగిపోయాను. కొత్త పార్టీ పెట్టనున్నాను అని నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన చేశారు. అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలని ఓ వైపు చెబుతూనే… యాదవులతో కలిపి పార్టీ పెట్టి బీసీలందర్నీ కలుపుకుని పోతాం అన్నారు.
రాజకీయ పార్టీ ఆవిర్భావంలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రథయాత్ర చేయనున్నారట. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లడానికి కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఆనందయ్య గురించి అందరికీ తెలిసిందే. నెల్లూరులో కరోనా మందు తయారీతో ఆనందయ్య అందరికీ పరిచయం అయ్యారు. కేవలం ప్రజలందరికీ తెలుసు కాబట్టి పార్టీ పెడతాం అనుకోవడం ఆయన అవగాహన రాహిత్యం అని చెప్పాలి.
ఇక గతంలో పలుమార్లు ఏపీ ప్రభుత్వం తాను మందు తయారుచేసి ప్రజలకు అందివ్వకుండా అడ్డుపడిందని చెప్పిన విషయం తెలిసిందే. మరి ఆనందయ్య పార్టీపై జనం ఎలా రెస్పాండవుతారో చూడాలి.