ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కాలంటే ఆ పార్టీ అధినేతను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. సీఎం కటాక్షం పొందితే మంత్రి సీట్లో కూర్చోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలందరూ ఇలా తమ తమ మార్గాల్లో సాగుతూ సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని 2019 మేలో అధికారం చేపట్టినపుడే జగన్ ప్రకటించారు. ఇప్పుడా సమయం దగ్గరకు వస్తుండడంతో అధికార పార్టీ నేతల్లో ఇప్పుడిదే చర్చ సాగుతోంది. మంత్రి అని పిలుపించుకోవడం చాలా మంది నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముట్టడికి ప్రయత్నించి నానా రచ్చా చేసిన వైసీపీ కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ ఈ రకంగా వ్యవహరించడం వెనక కూడా మంత్రి కావాలనే ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటే జగన్‌కు పడదనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించి.. అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడేలా చేయడంతో జగన్ దృష్టి రమేశ్‌పై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తమ ముఖ్యమంత్రిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ రమేశ్ ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించారని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు.
మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వర్థంతి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం చెలరేగింది. తమ నాయకుణ్ని అంత మాట అంటారా? అంటూ వైసీపీ నేతలు టీడీపీ నాయకులపై మాటల యుద్ధాన్ని మొదలెట్టారు.
ఇక జోగి రమేశ్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాబు ఇంటిపై రాళ్ల దాడి కూడా జరిగింది. అంతే కాకుండా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాటలో టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. వైసీపీ నాయకులు పది కార్లలో వచ్చి రాళ్లు కర్రలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక ఈ ఎపిసోడ్ మొత్తం తనకు రాజకీయంగా గొప్ప మైలేజీ ఇస్తుందని జోగి రమేశ్ భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే మంత్రివర్గంలో తనకు అవకాశం దక్కే వీలుంటుందని అనుకుంటున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రమేశ్ పెడన ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత వైసీపీలో చేరి గత ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సొంతం చేసుకున్నారు. మంత్రి పదవిపై ఆశతో ఉన్న ఆయన ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరీ ఈ తాజా సంఘటన ఆయనకు మంత్రి పదవి దక్కడంలో ఎంతమేరకు కలిసి వస్తుందో చూడాలి.