ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన సతీమణి టీఎన్ విజయలక్ష్మిలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. వారిద్దరిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి పబ్లిక్ సర్వెంట్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ క్రమంలో మంత్రి సురేశ్ పై టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శలు గుప్పించారు. ఈ అవినీతి ఆరోపణలపై గతంలో సురేశ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తన పదవికి సురేశ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జగన్ తక్షణమే సీఐడీ విచారణ జరిపించాలని అన్నారు. సురేశ్ వంటి వ్యక్తులు మంత్రి స్థానంలో ఉంటే విద్యార్థులు దారి తప్పే ప్రమాదముందని అన్నారు.
అసలేం జరిగిందంటే…
మంత్రి సురేశ్, ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ గతంలో ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేశారు. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన అనంతరం 2017లో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, సురేశ్‌ను రెండో నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అయితే, తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, కాబట్టి దీనిని కొట్టి వేయాలని సురేశ్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…సురేశ్ వాదనతో ఏకీభవించి ఆ ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చింది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఆధారాలున్న విషయాలను అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది.