ప్రస్తుతం అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. మహిళల విషయంలో విధించే ఆంక్షలపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కో ఎడ్యుకేషన్‌ను తాలిబన్లు రద్దు చేశారు. బురఖా ధరించాలని ఫత్వా జారీ చేశారు. అయితే.. ఇప్పుడు ఇదే తరహా ఆంక్షలు.. మనదేశంలోనూ వెలుగు చూశాయి.
వినడానికి కొంచెం విస్మయం అనిపించినా.. వాస్తవం అంటున్నారు పరిశీలకులు. బిహార్ భాగల్పుర్లోని ఓ మహిళా కళాశాల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. లూజ్ హెయిర్(జుట్టు విరబోసుకుని)తో కాలేజ్ ఆవరణలో కనిపించకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
బిహార్ భాగల్పుర్లోని సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది.
దీ్ంతో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమ్మాయిలు లూజ్ హెయిర్‌తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. రామన్ సిన్హా తేల్చి చెప్పారు. దీంతో కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.
సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అనే మూడు విభాగాలు ఉన్న ఈ కళాశాలలో ప్రస్తుతం 1,500 మంది అమ్మాయిలు చేరారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ కొత్త డ్రెస్ కోడ్‌ను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఉన్న సభ్యులు సూచించిన దుస్తులనే ధరించాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది.
సంస్థ అదేశాలను ఎవరైనా అతిక్రమించి డ్రెస్‌కోడ్ లేకుండా, జడ వేసుకోకుండా వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టం చేసింది. అయితే.. దేశంలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ మాట్లాడకపోతే.. చర్యలు తీసుకున్న సంస్థలు ఉన్నాయి. యూనిఫాం ధరించకపోతే.. చర్యలు తీసుకున్న సంస్థలు ఉన్నాయి కానీ.. ఇలా యువతుల జుట్టుపై ఆంక్షలు పెట్టిన సంస్థ ఇదే కావడంతో మన దేశంలో తాలిబన్ చట్టం అమలవుతోందా? అంటూ.. విద్యార్థినులు వాపోతున్నారు.