భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించగా…తాజాగా ఢిల్లీ కూడా అదే బాటలో పయనిస్తోంది.కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత రాజధాని న్యూఢిల్లీలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈ రోజు రాత్రి 10 గంటల నుండి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, వచ్చే సోమవారం వరకు 6 రోజులపాటు అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. తాము ఢిల్లీలో లాక్ డౌన్ విధించకపోతే ఆరోగ్య రంగంలోని మౌలిక సదుపాయాలు కూలిపోతాయని అన్నారు. అన్ని అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి భయంకరంగా ఉందని, తాము ప్రజలకు ఎప్పుడూ అబద్దం చెప్పలేదని అన్నారు.
తాము కరోనా పరిస్థితి గురించి పారదర్శకంగా ఉన్నామని, గత 3-4 రోజులలో సగటున రోజుకు 25,000 కేసులు వచ్చాయని అన్నారు. ఆసుపత్రుల్లో ఐసీయూలు, బెడ్లు, వెంటిలేటర్లు ఖాళీ లేవని, తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఉందని తెలిపారు. ఢిల్లీ ప్రజలంతా ఒక పెద్ద కుటుంబం లాంటివారని , లాక్ డౌన్, కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని కేజ్రీవాల్ తెలిపారు.
ప్రభుత్వానికి సహకరించినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వలస కార్మికులు ఢిల్లీ వదిలి వెళ్లవద్దని, ఇది 6 రోజులపాటు సాగే ఒక చిన్న లాక్ డౌన్ అని వారికి హామీ ఇచ్చారు. ఈ లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని తాను భావిస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు.