ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు ఒక్కసారి అంతటా ఉత్సాహం వెల్లివిరుస్తుంటుంది. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే.. కనీసం వందలాది మంది ఇళ్లల్లోనూ ఆ సందడి తాలూకు హడావుడి కనిపిస్తూ ఉంటుంది. నవంబర్ నాలుగు నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో.. దేశానికి ఈ నలభై రోజులు సందడి వాతావరణం నెలకొంటుందని చెప్పాలి. ఈ పెళ్లిళ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపుతో పాటు.. భారీ ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంటుంది.
తాజా అంచనాల ప్రకారం ఇప్పటికే మొదలైన పెళ్లిళ్ల సీజన్ పుణ్యమా అని సుమారు రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. లక్షలాది జంటలు ఏకం కానున్న ఈ పెళ్లి సీజన్ ఆర్థిక వ్యవస్థకు కొత్త శోభ ఖాయమని చెప్పాలి. దేశవ్యాప్తంగా జరిగే పెళ్లిళ్లలో మహా నగరాల పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మిగిలిన ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లతో పోలిస్తే.. మహానగరాల్లో జరిగే సంపన్న కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లు ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపును ఇస్తాయని చెప్పాలి.
ఒక అంచనా ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ సారి పెళ్లి సీజన్ లో 3.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని.. ఈ సందర్భంగా రూ.75వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత కాస్తంత గ్యాప్ తో జనవరి 14 నుంచి జులై వరకు నాన్ స్టాప్ గా కొనసాగనుంది. ఈ సందర్భంగా మరిన్ని పెళ్లిళ్లు జరగటం ఖాయం. అంటే.. వచ్చేదంతా పెళ్లిళ్ల సీజన్ అన్న మాటే. మార్కెట్ హుషారుగా ఉండటమే కాదు.. పెళ్లి సందడితో దేశ వ్యాప్తంగా అందరి ఇళ్లల్లో ఏదోలా సందడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పక తప్పదు.