జగన్ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు, ఆలయాల ఆస్తుల ఆక్రమణ, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలు వంటివి రావడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ప్రక్షాళన మొదలు ఆలయాలు, అర్చకుల కోసం హామీల అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచుతూ ఏపీ కేబినెట్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఆ పాలక మండలిలో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు కల్పించింది. ఇందుకు సంబంధించి చట్ట సవరణకు ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా దీపావళి నాడు ఏపీలోని వేద పండితులకు చంద్రబాబు సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేద పండితులకు నెలకు రూ.3 వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లోని పండితులకు ఈ నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించనుంది. ఏపీలోని 7 ఆలయాల పరిధిలో ఉన్న 600 మంది వేద పండితులకు తాజా నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై వారంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.