ఏపీలో మరో 8 మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేం దుకు అధికార పార్టీ వైసీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు తానుచేసిన ప్రతిజ్ఞ కావొచ్చు.. రాష్ట్రంలో అభివృద్ధి లేదనే కారణం కావొచ్చు.. ఏదేమైనా.. అధికారంలోకి రావాలని టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. వైసీపీ నేతలు.. పైకి తాము ప్రవేశ పెడుతున్న పథకాలే తమను గట్టెక్కిస్తాయని, వైనాట్ 175 అంటూ.. ఊదర గొడుతున్నారు.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు.
తాజాగా చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఏపీలో ఏకంగా 20 లక్షల మేరకు దొంగ ఓట్లు నమోదయ్యాయ ని తెలుస్తోంది. లేని ఇళ్లలోనూ ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. అదేసమయంలో ఒకే డోర్ నెంబరులో వందల ఓట్లు పుట్టుకు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితాలో అక్రమాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ నేతలకు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందన్నారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటరు వెరిఫికేషన్‌పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు తాజాగా సమీక్షించారు.
ఇప్పటి వరకు టీడీపీ నేతలు తీసిన లెక్కల ప్రకారం .. రాష్ట్రంలో 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించామని చంద్రబాబు తెలిపారు. వీటిపై చర్యలు కోరుతూ ప్రధాన ఎన్నికల అధికారికి అందజేశామని నేతలు ఆయన తెలిపారు. ఈ క్రమంలో దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయనే విషయాన్ని కూలంకషంగా చంద్రబాబు వివరించారు.
ఇదీ.. దొంగ దారి!
+ చనిపోయిన వారి ఓట్లు తొలగించకుండా ఉన్నట్టు కొనసాగించడం.
+ ఎక్కడో ఉన్నవారికి ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయడం
+ టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం
+ ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం
+ ఒకే డోర్ నెంబరులో వందల ఓట్లు ఉండడం
+ పూరి పాకల్లో 25 మంది ఓటర్లు ఉన్నట్టు చూపడం