మూడు.. నాలుగు రోజుల క్రితం వరకు ‘ఒమిక్రాన్’ అన్న మాటే జనాలకు తెలీని పరిస్థితి. అందుకు భిన్నంగా ఇప్పుడీ మాటను గంటకోసారి అయినా తలుచుకోకుండా ఉండలేని పరిస్థితి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు.. వాట్సాప్ గ్రూపుల్ని అదే పనిగాఆపరేట్ చేసే వారు.. న్యూస్ చానళ్లు.. వెబ్ సైట్లను ఫాలో అయ్యే వారికి ఇప్పుడీ పదం సుపరిచతంగా మారటమే కాదు.. దానికి సంబంధించిన వివరాల కోసం తెగ చదివేస్తూ.. షేర్ చేస్తున్న పరిస్థితి. ప్రపంచాన్ని వణికిస్తున్నఈ కొత్త వేరియంట్ కు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది.
దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ పుణ్యమా అని.. ఇప్పుడా దేశం నుంచి వస్తున్న వారి విషయంలో అన్ని దేశాలు బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ వేరియంట్ మీద వార్తలు రావటం మొదలైన తర్వాత అంటే ఈ నెల 25.. 26..27 తేదీల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలువురు ప్రయాణికులు దక్షిణాఫ్రికా నుంచి దిగారు. అలా వచ్చిన వారు మొత్తం 185 మందిగా తేలింది. ఇందులో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉందని భావిస్తున్న బొట్స్ వానా నుంచి మొత్తం పదహారు మంది ప్రయాణికులు హైదరాబాద్ కు వచ్చినట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. కొత్త వేరియంట్ కేసులు ఉన్న 12 దేశాలకు చెందిన ప్రయాణికులు కూడా హైదరాబాద్ రావటం కొత్త టెన్షన్ గా మారింది. ఇలా వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేనోళ్లు ఎంతమంది? అందులో లక్షణాలు లోపల ఉండి.. బయట పడనోళ్లు ఎంత మంది అన్న లెక్కలతో అధికారులకు బుర్రలు వేడెక్కిపోతున్నాయి. అయితే..కొంతలో కొంత రిలీఫ్ ఏమంటే..ఇలా వచ్చిన ప్రయాణికులందరికి ప్రత్యేక టీంలు ఆర్ టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అలా పరీక్షలు చేసిన వారు దాదాపు 2200 మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా యూకే నుంచొ 1717 మంది వస్తే.. అతి తక్కువగా మారిషస్ నుంచి ఇద్దరు వచ్చారు. ఇక.. ఎక్కువ ప్రయాణికులు వచ్చిన దేశాల్లో దక్షిణాఫ్రికా 185, న్యూజిలాండ్ 108, యూరోపియన్ దేశాల నుంచి 102 మంది వచ్చారు.
ఇప్పుడు పాజిటవ్ గా తేలిన 11 మంది రక్త నమూనాల్ని సీసీఎంబీకి పంపినట్లుగా చెబుతున్నారు. అక్కడ పూర్తిస్థాయి పరీక్షలు జరిపిన తర్వాత వీరిలో ఎవరికైనా ఒమిక్రాన్ వేరియంట్ ఉందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పాజిటివ్ గా తేలిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లుగా చెబుతున్నారు. కాకుంటే.. మిగిలిన వారిని కూడా ట్రాక్ చేసేలా ఏర్పాట్లు ఉన్నాయా? లేదా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్ తీవ్రత అందరికి తెలిసిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. విదేశాల నుంచి వచ్చిన వారిలో.. అందునా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 185 మందిపై మాత్రం ఒక కన్ను కాదు..వంద కళ్లు వేసుకొని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.