ప్రేమే నేరమౌనా.. నాపై పగేలా.. అంటూ.. ఆ 16 ఏళ్ల అమ్మాయి దారుణ తీరులో కన్ను మూసింది. ప్రేమించానంటూ వెంటపడిన వాడే.. చివరకు ఆమెను కర్కశంగా పొడిచి పొడిచి నడిరోడ్డుపై హతమార్చాడు. ఇంకా కసి తీరక చనిపోయిన స్థితిలో ఉన్న ఆమెను కాలితో తన్నాడు.. పక్కనే ఉన్న బండరాయితో మోదాడు. దేశరాజధాని ఢిల్లీలో అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఏం జరిగింది?
16 ఏళ్ల బాలిక సాక్షిని ఆమె బాయ్‌ఫ్రెండ్ సాహిల్(20) అత్యంత దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపైనే ఆమెను కత్తితో 34 సార్లు పొడిచి, బండరాయితో కొట్టి చంపాడు. ఢిల్లీ షాబాద్ ప్రాంతంలో జరిగిన ఘోరం అందరినీ నిశ్చేష్టులను చేసింది. హత్యకు గురైన బాలిక.. షాబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీ వాసి. 20 ఏళ్ల సాహిల్, ఆమె కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే వీరిద్దరికీ గొడవ జరిగింది. ఆదివారం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సాహిల్ అడ్డగించాడు.
అనూహ్యంగా బాలికను కత్తితో అనేకసార్లు పొడిచాడు. దగ్గర్లో ఉన్న బండరాయితో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నడి వీధిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు సాహిల్ కోసం ఆరుబృందాలుగా ఏర్పడి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరి మధ్య ప్రేమ వికటించడంతోనే ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. మొత్తంగా శ్రద్ధా వాకర్(ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన) ఉందంతం మరువకముందే.. ఇంత ఘోరం చోటు చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.