కరోనా వ్యాప్తి, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు, ఇటు రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు శుభ్రంగా తలంటేశాయి. అసలు ఇంతగా కేసులు పెరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నారం టూ.. నిలదీశాయి.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మరింత సీరియస్గా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినట్టుగా అనిపిస్తోందని.. అయినప్పటికీ.. ప్రబుత్వం జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని.. సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ ఈ సమస్యపై స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని తెలిపారు.
కోవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాక్డౌన్ను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ప్రభుత్వం అసలు కరోనాను పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదని తాము భావిస్తున్నట్టు హైకోర్టు నిప్పులు చెరిగింది.
అదేసమయంలో అసలు రాష్ట్రంలో కరోనాకేసులు ఎన్నినమోదవుతున్నాయి..? జిల్లాల్లో వస్తున్న లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న వాటికి పొంతన లేకుండా పోతోందని.. ఈ లెక్కల చిక్కులు ఏమిటో తేలుస్తామని హెచ్చరించింది.
అదేసమయంలో కరోనా మృతుల విషయంలోనూ ప్రభుత్వం దాపరికం చేస్తోందా? అని ప్రశ్నించింది. ఇక, కరోనాపై రాష్ట్ర పరిస్థితులు వివరిస్తూ.. అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించినప్పటికీ .. ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో .. జగన్ సర్కారు ఇరుకున పడిందని అంటున్నారు పరిశీలకులు.