శాసన మండలి వల్ల ఏమీ ఉపయోగం లేదు…మండలి వల్ల ప్రజాప్రతినిధులు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు… మండలిపై ఏడాదికి రూ.60 కోట్లు ప్రజాధనం వృథాగా ఖర్చవుతోంది…మరికొంత కాలం ఆగితే మండలిలో వైసీపీ సంఖ్యాబలం పెరుగుతుంది….కానీ, మండలిలో సంఖ్యాబలం కన్నా ప్రజా ప్రయోజనాలు, సంక్షేమ పథకాలే ముఖ్యం… కాబట్టి మండలిని వెంటనే రద్దు చేయాలన్న తీర్మానం ప్రవేశపెడుతున్నాం….గత ఏడాది జనవరిలో జరిగిన శాసన సభ సమావేశాల్లో మండలి రద్దుపై ఏపీ సీఎం జగన్ మాట్లాడిన మాటలివి.
సీన్ కట్ చేస్తే…మండలి రద్దు వ్యవహారం అటకెక్కింది…పదవుల పందేరంలో భాగంగా తాజాగా నలుగురు వైసీపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మండలికి పంపించారు జగన్. దీంతో, మండలిలో వైసీపీ సంఖ్యాబలం పెరిగింది. అంటే, జగన్ ఏదన్నా తీర్మానం చేస్తే ఇటు శాసన సభలోనూ…అటు శాసన మండలిలోనూ తిరుగులేదు. ఈ నేపథ్యంలోనే మండలి రద్దు చేస్తానన్న….తక్షణమే ఆ పని చేయాలని విమర్శలు వస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో శాసనమండలిని రద్దు చేయాలని జగన్కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ కూడా రాశారు. గతంలో మండలి రద్దు చేస్తానని చెప్పినపుడు వైసీపీకి మండలిలో సంఖ్యాబలం లేదని, ఇపుడు మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే జగన్ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని ఆర్ఆర్ఆర్ అన్నారు..మండలి కొనసాగించడం వృథా అని జగన్ చెప్పిన మాటలు జనం నమ్మాలంటే మండలిని వెంటనే రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
అంతేకాదు, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దు అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి, మండలి రద్దుకు తన వంతు ప్రయత్నం చేస్తానని, అందుకు వైసీపీ ఎంపీల సహకారం కూడా కావాలని కోరారు. జగన్ విలాసాలకు 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని రఘురామ లేఖలో వంగ్యాస్త్రాలు సంధించారు.
అయితే, ఆనాడు మండలి రద్దు చేస్తానన్న జగన్….బలం పెరగడం, కొందరు వైసీపీ నేతలను సంతృప్తి పరచడానికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాల్సి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో మండలి కొనసాగింపునకు మొగ్గు చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్….మండలిపై మాట తప్పారని కామెంట్లు వస్తున్నాయి.