ఈ టెక్ జమానాలో నగదు లావాదేవీలన్నీ దాదాపుగా డిజిటల్ మయం అవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో అయితే జేబులో డబ్బులు లేనిది బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. కానీ, ఇపుడు జేబులో స్మార్ట్ ఫోన్…బ్యాంకు ఖాతాలో తగినంత సొమ్ము ఉంటే చాలు దునియా మొత్తం చుట్టేయొచ్చు. ఆన్ లైన్ బ్యాంకింగ్ తో పాటు గూగుల్ పే, ఫోన్ పే వంటి ఎన్నో యూపీఐ యాప్ ల సాయంతో అరచేతిలోని అన్ని బ్యాంకులు ఇమిడిపోతున్నాయి.
ఇక, నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకుగాను ప్రధాని మోదీ తాజాగా మరో సరికొత్త ఆవిష్కరణతో దేశ ప్రజల ముందుకు వచ్చారు. నగదు లావాదేవీలకు స్వస్తి చెప్పేందుకు ఎలక్ట్రానిక్ వోచర్ ‘ఈ-రూపీ’ని మోదీ ఆవిష్కరించారు. ప్రపంచదేశాలతో పోటీపడేలా దేశాన్ని డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేయించేందుకు మోదీ సరికొత్త పేమెంట్ విధానంతో ముందుకు వచ్చారు. క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ లావాదేవీలను మరింత ఊతమిచ్చేలా e-RUPI వోచర్‌ను మోదీ నేడు రిలీజ్ చేశారు.
డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ చేయడంలో ఈరూపీ కీలకపాత్ర పోషిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈరూపీ ఎంతో పారదర్శకంగా, ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా నగదును బదిలీ చేస్తుందన్నారు. ఈ 21వ శతాబ్ధంలో అత్యాధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందనేందుకు ఈ-రూపీనే ఉదాహరణ అని మోదీ గర్వంగా ప్రకటించారు.
క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచర్‌ను పంపించవచ్చని, లబ్ధిదారుల మొబైల్‌కు ఆ వోచర్‌ను డెలివరీ చేస్తారని మోదీ చెప్పారు. దాని ద్వారా ఆ నగదును వాడుకోవచ్చని వెల్లడించారు. లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా నగదు జమ అయ్యేలా ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయని, ఆ తరహా లావాదేవీల్లో ఈరూపీ మరింత పారదర్శకత తెస్తుందని చెప్పారు.