ఏపీ సీఎం జగన్ పై రాజీనామా ఒత్తిడి పెరుగుతోందా? ఆయన రాజీనామా కోసం ప్రతిపక్షాలు పట్టుబడుతు న్నాయా? ఇదే విషయంపై సీఎం జగన్ చుట్టూ వివాదం ముదురుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. తాజాగా సుప్రీంకోర్టులో రాజధానిపై అనుకూలంగా తీర్పు రాకపోవడం.. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి బదిలీ చేయడం వంటి వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి.
దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర పార్టీల నాయకులు కూడా సీఎం జగన్పై విరుచుకుపడు తున్నారు. ఆయన రాజీనామా చేసి తీరాలని వారు పట్టుబడుతున్నారు. సొంత బాబాయి కేసు.. పొరుగు రాష్ట్రానికి విచారణకు వెళ్లిపోతే.. ఏపీ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినట్టు కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్పై రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. అయితే, దీనికి ఆయన లొంగే ఘటం కాదనేది అందరికీ తెలిసిందే.
అయితే.. ఈ హదావుడిమాత్రం పెరుగుతోంది. ఇక, టీడీపీ ఇదే వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. ఎన్నికలకు సమయం ఉందా? లేదా ? అనే విషయాన్ని పక్కన పెడితే రాజీనామా కోసం ఒత్తిడి చేసి.. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అనే కొణంలోప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు.. కోర్టుల నుంచి వస్తున్న తీర్పులు వంటివాటితో పాటు.. ప్రజల నుంచి తీసుకుంటున్న అభిప్రాయాలను కూడా టీడీపీ అధ్యయనం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే `జగన్ రాజీనామా చేయాలి` అనే నినాదాన్ని టీడీపీ బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయిం చుకుంది. డిసెంబరు 2 నుంచి ఎలా ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో వైసీపీ పాలనపై పోస్టు మార్టమ్ నివేదికను కూడా ప్రజల ముందు పెట్టి వారి అభిప్రాయం తెలుసుకోవాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామా అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి దీనిపై సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.