ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రామానికి హాజరయ్యేందుకు దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి భారీ సంఖ్యలో ఎన్నారైలు ఏపీకి తరలి వచ్చారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు వేలాదిగా తరలివచ్చారు. ముఖ్యంగా అమెరికా నుంచి టీడీపీ ఎన్నారై నేతలు భారీ సంఖ్యలో విజయవాడ చేరుకున్నారు.
అంతకుముందు కూడా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ కూటమి గెలుపు కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి ఎన్నారైలు భారీ సంఖ్యలో తరలివచ్చిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అబ్యర్థులకు ఓటు వేసేందుకే లక్షలాది రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మరీ ఎన్నారైలు తరలివచ్చారు. ఏదో వచ్చామా ఓటు వేశామా అన్న రీతిలో కాకుండా చాలామంది ఎన్నారైలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాలని ఊరూవాడా తమ వంతు ప్రచారాన్ని నిర్వహించి కూటమి విజయానికి తమ వంతు కృషి చేశారు.
చంద్రబాబు ఏపీకి సీఎం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, అప్పుల ఊబి నుంచి ఏపీ బయటపడుతుందని ఎన్నారైలు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కూటమి గెలిచి చంద్రబాబు సీఎం కాబోతుండడంతో ఎన్నారైలు అదే జోష్ తో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.