ఎన్నికలకు ముందు దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు, వాగ్దానాలపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉచిత హామీల వల్ల ప్రజలు మోసపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారం జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచిత హామీల వ్యవహారం మరింత జటిలంగా మారుతోందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పేదలందరికీ ఉచిత విద్య, అందరికీ తాగునీరు అందించే పథకాలు కూడా ఉచిత హామీలు అవుతాయా? అని సిజెఐ ఎన్వీ రమణ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అయితే, ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
కానీ, వాటిలో ఏవి సరైన హామీలు అన్నదే గుర్తించాల్సి ఉందని తెలిపింది. ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వస్తువులు ఉచితంగా ఇస్తామంటే అవి సంక్షేమ పథకాలు అవుతాయా అని ప్రశ్నించింది. ప్రజా ధనాన్ని సవ్యంగా ఖర్చు పెట్టాలని, అంతేగానీ, దానిని ఉచిత పథకాల పేరుతో దుబారా చేయకూడదని అభిప్రాయపడింది. కొందరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలు అంటున్నారని, ఆ విషయం పైనే చర్చ జరగాల్సి ఉందని, ఈ తరహా అంశాలన్నీ చాలా సంక్లిష్టంగా మారుతున్నాయని వెల్లడించిందది.
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలే అవి నెగ్గటానికి ప్రాతిపదిక కాదని, జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం ద్వారా పౌరులకు గౌరవప్రదమైన జీవనం లభించిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇటువంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని పార్టీలు ఉచిత హామీలు గుప్పించినా సరే ఎన్నికల్లో గెలవలేదన్న విషయాన్ని కూడా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అందుకే, ఈ ఉచిత పథకాలు హామీలు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై మరిన్ని విస్తృత అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నామని వెల్లడించారు .ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వచ్చే వారం ఉంటుందని తెలిపారు.