కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. వ్యాక్సినేషన్ పుణ్యమా అంటూ సెకండ్ వేవ్ తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టినా…థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు కలవరపడుతున్నారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందని నిపుణులు హెచ్చరించడం…పిల్లలకు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలోనే చిన్నారులకు ఇవ్వగలిగిన తొలి వ్యాక్సిన్ ‘జైకోవ్–డి’ త్వరలో అందుబాటులోకి రానుంది. పన్నెండేళ్లు దాటిన పిల్లలతోపాటు పెద్దవారిలోనూ ప్రభావవంతంగా ఈ టీకా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ టీకా అత్యవసర వాడకానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ దేశీయ వ్యాక్సిన్ అందుబాటు ధరలోనే ఉండనుందని తెలుస్తోంది.
అందుబాటులో ఉన్న అన్ని టీకాలు రెండు డోసులుండగా…జైకోవ్–డి వ్యాక్సిన్ మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి రోజుతోపాటు 28వ రోజున, 56వ రోజున ఈ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటవరకు ఉన్న వ్యాక్సిన్ లన్నీ ఇంట్రామస్క్యులర్ (కండరాల లోపల ఇచ్చేవి) కాగా.. జైకోవ్–డి టీకా మాత్రం ఇంట్రాడెర్మల్ (చర్మానికి, కండరాలకు మధ్య) రూపంలో ఇవ్వనున్నారు. సూది లేకుండా ఫార్మాజెట్ అనే ప్రత్యేక ఇంజెక్టర్‌ను ఈ వ్యాక్సిన్ ను శరీరంలోకి పంపేందుకు వాడతారు. కొత్త వేరియంట్లను సైతం తట్టుకునేలా ఈ వ్యాక్సిన్‌లో మార్పులు చేసి వినియోగించవచ్చని చెబుతున్నారు.
ప్రపంచంలో అత్యాధునికమైన డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో రూపొందించిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. డీబీటీ, ఐసీఎంఆర్ సహకారంతో..: ‘మిషన్ కోవిడ్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా.. జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)ల సహకారంతో జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ వ్యాక్సిన్‌ను అభి వృద్ధి చేసింది. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో కరోనా వ్యాక్సిన్ కూడా ఇదే. మరోవైపు, జైకోవ్–డి వ్యాక్సిన్ అనుమతిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో దేశం మరో ముందడుగు వేసిందని, శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారని అభినందించారు.