ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో పాక్ జట్టుకు భారత్ భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ పోరులో దాయాది జట్టుపై టీమిండియా విజయఢంకా మోగించింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు విజయం ఇరుజట్లతో దోబూచులాడింది. తీవ్ర ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డ భారత్ ఆ మ్యాచ్ లో విజేతగా నిలవడంతో పాక్ కు కోలోకోలేని షాక్ తగిలింది. అయితే, ఆ షాక్ నుంచి పాక్ తేరుకోక ముందే తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తగిలింది.
తాజాగా జింబాబ్వేతో ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాక్ ఓటమి పాలైంది. భారత్ తో మ్యాచ్ తరహాలోనే చివరి ఓవర్ చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో పాక్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు సంచలనం రేపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే చేసింది.
131 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాట్స్ మన్లలో షాన్ మసూద్ (44) మినహా మరెవరూ రాణించలేదు. అతడికి మిగిలిన బ్యాట్స్ మన్ల నుంచి పెద్దగా సహకారం లభించలేదు. 20వ ఓవర్ చివరి బంతికి 3 పరుగులు కావాల్సిన దశలో పాక్ ఒత్తిడికి లోనైంది. పాక్ బౌలర్ షహీద్ అఫ్రీది రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో, 20 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక్క పరుగుతో జింబాబ్వే చేతిలో పాక్ ఘోర పరాజయం పాలవడంతో ఆ జట్టుకు వరుసగా రెండు షాక్ లు తగిలినట్లయింది.