తనపై కొందరు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ పై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంపై వీరిద్దరూ చర్చ జరిపారట.
తాను పార్టీ టిక్కెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీపై అలగలేదని, పార్టీలోని కొందరిపై మాత్రమే తన కంప్లయింట్ అని చెప్పారు. జగన్ తో గతంలో మాదిరిగానే భేటీ అయ్యానని, తన నియోజకవర్గంపై దృష్టి సారించాలని తనకు సూచించారని చెప్పారు. జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు. గతంలోనే తాను కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానని, మంత్రి పదవిని వదులుకొని ప్రోటోకాల్‌పై ఫీల్ అయ్యేది ఏమీ లేదని అన్నారు.
అయితే, గత రాత్రి బాలినేనితో పాటు వైవీ సుబ్బారెడ్డి కూడా సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ముందస్తు కార్యక్రమాలున్నాయన్న సమాచారంతో జగన్ కు కలవలేదు. అయితే, ఇద్దరితో తాను మాట్లాడాలని, అందుకు సిద్ధం కావాలని బాలినేనికి సీఎం సూచించినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో కూడా భేటీ కావాలని, ప్రత్యేకించి ఒకరిద్దరు నాయకులతో సమావేశం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. వైవీతో కలిసి తన వద్ద సమావేశం కావాలన్న జగన్ సూచనపై కూడా బాలినేని సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది..
అయితే జగన్ మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ఇద్దరు కలిసి తన వద్ద సమావేశం కావాల్సిందేనని, అలాగే కొన్నిచోట్ల ఉన్న పరిస్థితులపై అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో కలిసి రాష్ట్ర నాయకుల సమక్షంలో మాట్లాడుకోవాల్సిందేనని అన్నట్లు తెలిసింది. ఆ సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులపై వారు చర్చించినట్లు సమాచారం. జగన్‌తో భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో బాలినేని చాలాసేపు సమావేశమై మాట్లాడటం విశేషం.