తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ఓటమి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. మేధావులను సంప్రదించిన తర్వాత ఈ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని పొగడ్తలలో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వేరుగా చూడలేదని షర్మిల అన్నారు.
షర్మిల తాజా ప్రకటనతో బీఆర్ఎస్ నేతలే కాదు వైఎస్సార్టీపీ నేతలు కూడా షాకయ్యారు. టికెట్ల కోసం రెండ్రోజులుగా లోటస్ పాండ్ లో షర్మిలతో మంతనాలు జరుపుతున్న ఆ పార్టీ నేతలు షర్మిల ప్రకటనతో ఖంగుతిన్నారు. కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సిన సమయంలో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని షర్మిల చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.