నలుగురు కలిసి నడిస్తేనే ఏదైనా సాధ్యం. అది రాజకీయమైనా.. వ్యక్తిగతమైనా.. ఒక్కటే. ఇలా.. అందరినీ ఏక తాటిపైకి తీసుకుని రావడం వల్లే.. వైసీపీ అధికారంలోకి రావడం తేలికైంది. అంతేకాదు.. భారీ ఎత్తున మెజారిటీ కూడా సాధించడం సాధ్యమైంది.
అయితే..అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొన్ని జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఆయా జిల్లాల్లో .. నేతలు ఎవరికి వారుగా ఉంటున్నారు. ఇలాంటి జిల్లాల్లో.. ప్రకాశం జిల్లా కీలకంగా మారింది. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరిద్దరూ..కూడా జగన్‌కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు.
దీంతో జిల్లాలో వీరిద్దరూ కలిసి పార్టీని ఏకతాటిపై నడిపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. మంత్రి ఆదిమూలపు సురేశ్ మాత్రం తన పనితాను చేసుకుని పోతున్నారు తప్ప.. పార్టీకి సంబంధించిన వ్యవహా రాలు పట్టించుకోవడం లేదు.
ఇక, మరో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టించుకుంటున్నా.. కొందరు మాత్ర మే ఆయనకు టచ్‌లో ఉంటున్నారు. చీరాలలో పరిస్థితి ఇప్పటికీ అదుపు చేయలేక పోయారు. ఇక, టీడీపీకి పట్టున్న.. నాలుగు నియోజకవర్గాల్లో (గత ఎన్నికల్లో విజయం సాధించినవి) వైసీపీ దూకుడు ఎక్కడా కనిపించడం లేదు.
ఇక, నాయకుడు కూడా ఎవరికి వారుగా ఉంటున్నారు. పదవులు అవసరమైనప్పుడు మాత్రమే.. పార్టీ గుర్తు కు వస్తోందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అదేసమయంలో కొన్ని నియోజకవర్గాల్లో.. ఆధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నిర్లిప్తతలు దర్శనమిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు కూడా కొనసాగితే.. పార్టీ చిక్కుల్లో పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు టీడీపీ నేతలు చాపకింద నీరులా.. కేడర్‌ను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విదానాలపై నాయకులు దండెత్తుతున్న తీరు చూస్తే.. టీడీపీ పుంజుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నాయకులు కూడా ప్రభుత్వం పెడుతున్నకేసులకు లెక్క చేయకుండా బయటకు వస్తున్నారు.
పార్టీలో చిన్నపాటి అసంతృప్తులే తప్ప.. టీడీపీలో పెద్దగా మైనస్‌లు ఇప్పుడు కనిపించడం లేదు. వెరసి.. వచ్చే ఎన్నికల నాటిని పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ.. వైసీపీలో మాత్రం నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.