ఏపీలో ప్రభుత్వం మారిపోయి.. మూడేళ్లు దాటింది. గత చంద్రబాబు ప్రభుత్వం పక్కకు వెళ్లి మూడేళ్లు అయింది. అదేసమయంలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చారు. మరి ఈ మూడేళ్లలో ఆయన ఏం చేశారనేది ప్రస్తుతం చర్చకు వచ్చే.. రావాల్సిన విషయం. కానీ.. ఇప్పటికీ.. చంద్రబాబు పాలనపై అదే అక్కసు వెళ్ల గక్కుతున్నారు. తమ ప్రభుత్వ లోపాలను.. తమ వైఫల్యాలను ఎవరు ప్రశ్నించినా.. వెంటనే చంద్రబాబు పాలన గురించే చర్చిస్తున్నారు. `అదిగో అప్పుడే.. ఇలా చేసి ఉంటే“ అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు.
అలా చేశారో.. చేయలేదో.. పక్కన పెడితే.. మీరు ఏం చేస్తున్నారనేది.,. ప్రధాన ప్రశ్న. కానీ.. దీనికి వైసీపీ నాయకులు మాత్రం.. దాటవేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధిత అంశాలపై ఢిల్లీలో ఆర్థికశాఖ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం భేటీలో చర్చించిన అంశాలను బుగ్గన, విజయసాయి రెడ్డి మీడియాకు వెల్లడిం చారు. సమావేశంలో విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించినట్లు బుగ్గన స్పష్టం చేశారు. 2016 లోపు పూర్తి కావాల్సినవి ఇంకా జరగలేదన్నారు.
గత చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని సరిగ్గా అడిగి ఉంటే హామీలన్నీ గతంలోనే పూర్తయి ఉండేవన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు లేకుండా చూడాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధానితో సీఎం జగన్ చర్చించిన అంశాలపై భేటీలో చర్చ జరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం తీసుకున్న రుణాలను రెగ్యులరైజ్ చేయాలని కోరామన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6500 కోట్ల విద్యుత్ బకాయిల గురించి చర్చించామన్నారు. పోలవరం ప్రాజెక్టు, భోగాపురం పోర్టుకు ఎన్వోసీ గురించి చర్చించామని తెలిపారు.
విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించామని చెప్పారు. పౌరసరఫరాలశాఖ రుణాలను విభజన చేయాలని కోరామన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు గురించి అడిగామన్నారు. బీచ్ సాండ్ నిబంధనలు సవరించాలని కోరినట్టు తెలిపారు. కొత్త జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరామని, 12 జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలని కోరామని సాయిరెడ్డి వివరించారు. పనిలో పనిగా.. “ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే చేయాల్సిన పనులు. ఇప్పుడు మేం చేస్తున్నాం“ అంటూ.. విమర్శల రాళ్లు రువ్వారు.