- కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులు
- తల్లిదండ్రులకు బదిలీ
- వారు వేరే అవసరాలకు వాడితే
- తనకు సంబంధం లేదట!
- తప్పుబట్టిన హైకోర్టు
- విద్యాదీవెన సొమ్ము కళాశాలలకే
- జమచేయాలని ఆదేశం
కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాయి. కళాశాలలో చదువుకున్నందుకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వమే చెల్లించేది. రీయింబర్స్మెంట్ రూపంలో యాజమాన్యాలకు ఇచ్చేది.
కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక.. అలా చేస్తే తనకేం ప్రయోజనమని ఆలోచించింది. కొత్తగా చేస్తున్నట్లు చెప్పుకోవాలని.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేరు మార్చి, రూటు మార్చింది. కళాశాలలకు ఇస్తే తమకేం లాభం? విద్యార్థుల తల్లిదండ్రులకు ఇస్తే బోలెడంత ప్రచారం లభిస్తుందని రాజకీయ కోణంలో ఆలోచించింది. కళాశాలలకు బదులుగా విద్యార్థుల తల్లులకు ‘విద్యాదీవెన’ ఇవ్వాలని నిర్ణయించింది.
తల్లులకు ఇస్తే.. వారి చేత్తో వారు కళాశాలకు ఫీజు కడితే అక్కడ చదువు ఎలా చెబుతున్నారో చూసేందుకు, అడిగేందుకు వీలుంటుందనే కవరింగ్‌ను చేర్చింది. ఈ మేరకు జీవో 28ని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మరో ఉత్తర్వు జీవో 64ను తీసుకొచ్చింది. దీనిప్రకారం.. ప్రభుత్వం విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో వేసిన ఫీజును.. వారు ఒకవేళ కళాశాలలకు చెల్లించకుంటే తనకు బాధ్యత లేదని చెప్పింది.
తల్లులు ఆ ఫీజును దుర్వినియోగం చేసి కళాశాలలకు కట్టకుంటే.. ఆ తర్వాతి త్రైమాసికం నుంచి ఆయా విద్యార్థులను జగనన్న విద్యాదీవెన పథకం నుంచి తీసేస్తామని పేర్కొంది. అంటే ప్రచారం కోసం కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజుల్ని తల్లులకు ఇస్తారు.
ఒకవేళ ఆ తల్లులు సదరు ఫీజును కళాశాలకు కట్టకుంటే విద్యార్థికి ఇక పథకమే కట్. అంటే చదువు ఇక సాగదు. దీనిపై తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ప్రచార ఆర్భాటం కోసం పనిచేస్తే కొన్నిచోట్ల ఇలాంటి ఇబ్బందులే తలెత్తాయి. అత్యవసర పరిస్థితిలో, పేదరికంలో ఉన్న తల్లులు ఒక్కోసారి ప్రభుత్వం ఇచ్చిన డబ్బును రకరకాల అవసరాలకు వాడేశారు. పిల్లాడికి ఫీజు కట్టలేకపోయారు. మరి అతని చదువేం కావాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.
నేరుగా ఇచ్చే డబ్బును రూటు మార్చి, డప్పు కొట్టి ఇద్దామనే ప్రభుత్వ ఆలోచన విద్యార్థుల చదువును ప్రశ్నార్ధకం చేసిందనే విమర్శలు వచ్చాయి. దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తల్లుల ఖాతాల్లో కాకుండా ఇకనుంచీ కళాశాలల ఖాతాల్లోనే విద్యాదీవెన.. అంటే ఫీజుల్ని వేయాలని నిర్దేశిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
‘ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమచేసిన సొమ్మును 40శాతం మంది కళాశాలలకు చెల్లించలేదు. పథకానికి అర్హులైన విద్యార్ధుల అడ్మిషన్ల సమయంలో ఫీజులు కోసం యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని చెబుతున్న ప్రభుత్వం.. తల్లులు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని చెప్పడమేంటి? అడ్మిషన్ల సమయంలో ఫీజులు వసూలు చేయకపోతే.. తల్లులు ఫీజులు చెల్లించకపోతే కళాశాలలు మనుగడ సాధించలేవు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపఽథ్యంలో తల్లుల ఖాతాలో ఫీజురీయింబర్స్ మెంట్ సొమ్మును జమచేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించింది.
సక్రమంగా సాగే చదువుకు..
వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎప్పటినుంచో ఉంది. పిల్లలను కళాశాలకు పంపిస్తే…వారు ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండానే చదువు సాగిపోయేది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇలా ఏ కోర్సులో చేరినా.. ఫీజు కట్టాల్సిన ఇబ్బంది ఉండేదికాదు.
ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో కళాశాలలకు ఆ ఫీజును చెల్లించేసేది. దీని కింద ప్రభుత్వాలు ఏటా వందల కోట్లు చెల్లించేవి. ప్రభుత్వానికి-కళాశాలలకు మధ్యనే వ్యవహారం నడిచేది. విద్యార్థులను ఫీజుల కోసం కళాశాలలు ఒత్తిడి చేసేవి కాదు. వారి చదువులు సక్రమంగా సాగిపోయేవి. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పద్ధతి మార్చింది.
తల్లుల ఖాతాలో పడిన వారం రోజుల్లోగా ఆ మొత్తాన్ని కళాశాలలకు కట్టాలంది. దీంతో కళాశాలల్లో టెన్షన్ పెరిగింది. తల్లుల ఖాతాలో పడ్డాక వారెప్పుడు కడతారా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఒకవేళ కట్టకుంటే ఏం చేయాలో తోచని స్థితి. మరోవైపు తల్లులు కూడా ఫీజు తమ ఖాతాలో పడగానే..వాటిని కట్టేందుకు కళాశాలలకు వెళ్లాల్సి వచ్చేది.
వెళ్లినప్పుడు ఆయా కళాశాలల్లో పరిస్థితులను గమనించి అడిగితే మంచిదే. కానీ చాలా మంది ఇలా వెళ్లి రావడం వల్ల ఒకరోజు తమ పని పోయిందని భావించిన వారూ ఉన్నారు. నీ ముక్కేది అంటే తలచుట్టూ తిప్పి చూపించినట్లే వ్యవహారం ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి.
కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం తన ప్రచార ఆర్మాటం మానుకుని.. కళాశాలలకే ఫీజు ఇవ్వడంతో పాటు అవి ప్రమాణాలు పాటించేలా చూడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.