ఇసుక వ్యాపారానికి సంబందించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకాలు తదితరాలన్నింటిని కేంద్ర ప్రభుత్వ సంస్ధలకు అప్పగించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం జరిగింది. ఒకవేళ కేంద్రసంస్దలు బాధ్యత తీసుకునేందుకు ముందుకు రాకపోతేనే ప్రైవేటు సంస్ధలకు అప్పగించాలని కూడా డిసైడ్ చేసింది. ప్రైవేటు సంస్ధలకు అప్పగించేటపుడు బహిరంగ వేలం ద్వారానే జరగాలని కూడా నిర్ణయించింది. తాజాగా ఇసుక విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో చాలా వరకు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు తగ్గిపోతాయన్నది ప్రభుత్వ ఆలోచన. తాజా నిర్ణయం చూస్తుంటే జగన్ సర్కారు ఇసుక సమస్యను పరిష్కరించడానికి కిందా మీదా పడుతోందనే చెప్పాలి.
ఇసుక అన్నది చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోనే ఆదాయ వనరుగా వైసీపీ దుష్ప్రచారం చేయడమే వైసీపీ కొంపముంచింది. ఇపుడు చంద్రబాబు హయాం కంటే తక్కువ ధరకు ఇసుక దొరికితే తప్ప జగన్ ను జనం నమ్మరు. అప్పటికంటే రూపాయి ఎక్కువైనా చంద్రబాబుపై చేసిన అబద్ధపు ప్రచారం జనానికి పూర్తిగా తెలిసిపోతుంది. చాలామందికి ఇప్పటికే అర్థమైంది.
ఇసుక అనేది వైఎస్ హయాం నుంచి ఒక దందాలా మారిపోయింది. అది సైలెంటుగా జరిగేది. ఎవరూ పట్టించుకునే వారు కాదు. కాబట్టి ఇసుక వ్యాపారంపై ఎక్కడా ఆరోపణలు, బహిరంగంగా గొడవలుండేవి కావు. చంద్రబాబు హాయంలో కృష్ణా జిల్లాలోని ముసునూరు గ్రామంలో అప్పటి టీడీపీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఎంఆర్వో వనజాక్షి మధ్య వివాదం వల్ల దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆ ఘటన ఆధారంగా పై దాడి చేసిన ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
వైసీపీ నాయకులు అధికారంలోకి రాగానే మొదట ఇసుక మీదే కన్నేశారు. కానీ వారి ఆకలికి పార్టీ వణికిపోయింది. ఆర్నెల్లు ఇసుక రద్దు చేయడం, తర్వాత కరోనా రావడంతో వైసీపీ నిర్వాకం పుణ్యమా అని ఇసుక బంగారం అయిపోయింది. ఇది చాలదన్నట్లు ఇసుక ను జగన్ హయాంలో తొలిసారిగా బ్లాక్ లో అమ్మకాలు జరిపారు. ఒక పాలసీ తెచ్చినా దానిని అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం ఫెయిలైంది. దాంతో ఇటువంటి ఆరోపణలకు చెక్ పెట్టిందుకు మొత్తం వ్యాపారాన్ని కేంద్రప్రభుత్వ సంస్ధలకు అప్పగించేయాలని డిసైడ్ అయ్యింది. ఇది కనుక జరిగితే భవిష్యత్తులో ఇది ప్రజలకు భారంగా మారుతుంది.
ఒకవేళ కేంద్ర సంస్ధలు కాదంటేనే బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు సంస్ధలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండిసి) లాంటి 8 సంస్ధలతో సంప్రదింపులు మొదలుపెట్టింది ప్రభుత్వం.
కేంద్రసంస్దలు ముందుకు రాకపోతే బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు సంస్ధలకే అప్పగిస్తారంటే మళ్ళీ సమస్య మొదటికే వస్తుందేమో. ఎందుకంటే ధరలను ప్రభుత్వమే నిర్ణయించినా అవి అమలు అయ్యేది అనుమానమే. ఇసుక విధానంపై ఇపుడు మొత్తం ఆజమాయిషి ప్రభుత్వం చేతిలో ఉంటేనే ఆరోపణలు వస్తున్నాయి. మరి మొత్తం వ్యవహారం ప్రైవేటుపరం చేస్తే ఆరోపణలు, వివాదాలు పెరిగకుండా ఉంటాయా ? ప్రభుత్వ ప్రయత్నం వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగపడతాయో తెలియాలంటే ఏదో విధానం అమల్లోకి రావాల్సిందే. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.