కొన్నేళ్ల క్రితం అనే కన్నా.. దశాబ్దాల క్రితం అనటం మంచిది. చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు అనే పెద్ద మనిషి ఉండేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు అంత ఫేమస్ కాదు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం చాలా సుపరిచితుడు. ఇప్పుడు ఎందుకు అవన్ని అంటారా? అక్కడికే వస్తున్నాం.
మారిన కాలానికి తగ్గట్లు కొత్త తరం వచ్చేసింది. ఆయన పేరును గుర్తుంచుకునేటోళ్ల కన్నా.. మర్చిపోయేవారు పెరిగిపోతున్నారు. అలాంటివేళలో చోటు చేసుకుంది తాజా ఉదంతం. ఆయన తనకున్న 3 వేల ఎకరాలు (తప్పుగా రాయలేదు.. సరిగానే రాశాం) విద్యా సంస్థలకు దానం చేసేశారు. అంత భారీ దానం చేసి కూడా సదరు విద్యా సంస్థలకు తన పేరు కానీ.. తన తాతలు.. తండ్రుల పేర్లు పెట్టుకోలేదు.
కస్తూరిబా అంటూ జాతిపిత మహాత్మాగాంధీ గారి ధర్మపత్ని పేరు పెట్టేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కస్తూరిబా కాలేజీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అలాంటి ఈ కాలేజీ పేరు చటుక్కున మారింది. ఎందుకంటారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వారు కాలేజీకి 30 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చారు మరి. అంత భారీగా భూమి ఇచ్చిన పెద్దాయన ఒక ప్రపోజల్ పెట్టారు.
అదేమంటే.. 30 సెంట్ల భూమిని కాలేజీకి ఇచ్చినందుకుగాను.. కాలేజీకి తన తండ్రిగారి పేరును పెట్టాలని విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ప్రభుత్వం.. ఒక జీవోను జారీ చేసింది. ఇంతకాలం కస్తూరిబా ఉన్న కాలేజీ పేరును తీసేసి.. గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలగా మారుస్తూ జీవో జారీ చేశారు.
ఒకవేళ.. ఎమ్మెల్యే వారిచ్చిన 30 సెంట్ల భారీ స్థలం విలువైనది అనుకుంటే.. ఎప్పటినుంచో ఉన్న కస్తూరిబా పేరును కొనసాగిస్తూ.. ఎమ్మెల్యే తండ్రి వారి పేరును కూడా పెడితే బాగుండేది కదా? అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం నో అంటే నో.. పాత పేరునే కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. 30 సెంట్ల స్థలం ఇచ్చి పేరు మార్చేసే కొత్త ట్రెండ్ షురూ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు పెరుగుతున్న వేళ.. ఏం చేస్తారో చూడాలి.