- సొంతగా కట్టుకోలేనివారికి తానే కట్టించి ఇస్తానని గతంలో హామీ
- ఇప్పుడు మీరే నిర్మించుకోవాలని పేదలపై ఒత్తిళ్లు
- జాబితా నుంచి 66 వేలమంది కట్
- ఒప్పుకోనివారికి వలంటీర్లతో హెచ్చరికలు
- స్థలం కూడా రాదని ఫోన్లలో బెదిరింపులు
పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వలేక.. జగన్ సర్కారు ఆ భారాన్ని వారిపైనే నెట్టేలా ప్లాన్చేసింది. ‘కట్టుకుంటామంటేనే స్థలం ఇస్తాం. లేదంటే అది కూడా ఉండదు’ తెగేసి చెబుతోంది. దీంతో ఉచితంగా ఇచ్చిన స్థలం పోగొట్టుకోవడం ఇష్టంలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పేదలు అప్పు చేసైనా ఇల్లు కట్టుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.
ఫలితంగా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఆప్షన్లో లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయి, సొంతంగా కట్టుకుంటామనే ఆప్షన్లలో సంఖ్య పెరిగిపోతోంది. నిరుపేదలకు ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది. వారిలో చాలామందికి ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. అందుకే తాను కట్టించి ఇచ్చే ఆప్షన్ను పెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ ఇప్పుడు ‘నిర్మాణాలు వెంటనే మొదలుపెట్టాలి’ అంటూ సర్కారు ఈ ఆప్షన్ తీసుకున్నవారిని తరుముతోంది. వలంటీర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తోంది. ‘స్థలం కావాలంటే ఇల్లు మొదలుపెట్టు’ అంటూ స్థానిక నేతలనూ రంగంలోకి దింపి పేదలను బెంబేలెత్తిస్తోంది. అదేమంటే.. ప్రభుత్వం కట్టిస్తామంటున్నా, వద్దొద్దు మేమే కట్టుకోగలం అనే స్థితికి పేదలు చేరారంటూ వింత వాదనలు చేస్తోంది.
నిజానికి కరోనాతో అందరూ ఆర్థికంగా సతమతమవుతున్న కాలమిది. పేదల ఆర్థిక స్థితి మరింత దిగజారింది. ఇలాంటప్పుడు ప్రభుత్వం కట్టించే మూడో ఆప్షన్ను పేదలు ఎందుకు వదులుకుంటారు? ఒకరిద్దరు కాదు.. ఏకంగా 66వేలమందిని ప్రభుత్వమే బలవంతంగా మార్పించింది.
మాట తప్పి.. మడెం తిప్పి..
అప్పుల తప్పులతో ఆర్థిక వ్యవస్థ అంపశయ్యపై చేరుతున్న స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లపై మాట తప్పింది! మూడో ఆప్షన్పై మడెం తిప్పింది.పేదలకు పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
చేతి నుంచి రూపాయి పడకుండా కొత్త ఇంట్లోకి వెళ్లొచ్చని పేదలు ఆశపడ్డారు. కానీ ఆయన సీఎం అయ్యాక.. ప్రభుత్వమే కట్టివ్వడం అనేది ఒక ఆప్షన్ మాత్రమేనంటూ.. మొత్తం మూడు రకాల ఆప్షన్లను తెరపైకి తెచ్చారు. మొదటి ఆప్షన్లో ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ సామగ్రి తీసుకుని లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకోవాలి. రెండో ఆప్షన్లో ప్రభుత్వం నుంచి రాయితీ తీసుకుని ఇల్లు కట్టుకోవాలి.
అసలు కట్టుకోవడం తమవల్ల కాదనుకునేవారికి ప్రభుత్వమే పూర్తిగా కట్టించి ఇచ్చే విధంగా మూడో ఆప్షన్ను పెట్టారు. దీంతో స్థలాలు పొందే సమయంలోనే పేదలంతా మూడో ఆప్షన్నే ఎంచుకున్నారు. అయితే అందరికీ కట్టించి ఇవ్వడం తలకుమించిన భారమని భావించిన ప్రభుత్వం.. అప్పట్లోనే మొదటి రెండు ఆప్షన్లే ఎంచుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చింది.
ఫలితంగా చాలా మంది మొదటి రెండు ఆప్షన్లకు మారిపోయారు. చివరకు 3,25,899 మంది మాత్రం తమవల్ల కాదని, ఇస్తే ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని మూడో ఆప్షన్ పెట్టుకున్నారు. కిందటి నెల వరకూ వీరి సంఖ్య ఇంతే ఉంది. ఏమైందో ఏమో ఇప్పుడు అకస్మాత్తుగా 2,59,329కి పడిపోయింది. అంటే 66,570 మందిని తొలగించారన్న మాట.
అదే సమయంలో మొదటి రెండు ఆప్షన్లకు లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. వారంతా సొంతంగా కట్టుకుంటామని ముందుకొచ్చి భూమిపూజలు చేసుకోవడం వల్లే ఆప్షన్లు మార్చామని ప్రభుత్వం చెబుతోంది. మూడో ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారుల సంఖ్య మున్ముందు మరింత తగ్గవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జరుగుతోంది ఇదే..
ఎలాగైనా మూడో ఆప్షన్లో ఉన్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వలంటీర్లను, గ్రామ/వార్డు సచివాలయాలను ప్రయోగిస్తోంది. మూడో ఆప్షన్లోనే ఉండిపోతే మీకు స్థలం కూడా మిగలదని, వెంటనే ఆప్షన్ మార్చుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించుకోవాలని వారు పేదలను హెచ్చరిస్తున్నారు.
దీంతో తప్పని పరిస్థితుల్లో ఆర్థిక స్తోమత లేకపోయినా పేదలు ఆప్షన్ మార్చుకుంటున్నారు. కొందరి ఆప్షన్లను వారి ప్రమేయమే లేకుండా అధికార యంత్రాంగమే మార్చేస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇంకోవైపు.. ప్రభుత్వం ఇచ్చే రూ.1.8 లక్షలతో ఇల్లు కట్టుకోవడం ఎలాగని పేదలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు, రూ.2.5 లక్షల చొప్పున సామాజికవర్గాల వారీగా రాయితీలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఆ రాయితీని అందరికీ ఒకేవిధంగా రూ.1.8 లక్షలకు కుదించింది. ఇప్పుడున్న రేట్లతో పోలిస్తే ఆ రాయితీ నగదుకు సగం ఇల్లు కూడా పూర్తికాదని పేదలు ఆందోళన చెందుతున్నారు.