అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు ఎంపీలు `ఒకరటు.. మరొకరు ఇటు` అన్నట్టుగా బయటకు వచ్చేశారు. వారే.. ఒకరు విజయవాడ టీడీపీ నాయకుడు, ఎంపీ కేశినేని శ్రీనివాస్.. ఉరఫ్ నాని. రెండో వారు కర్నూలు ఎంపీ, వైసీపీ నేత సంజీవ్ కుమార్. ఇద్దరూ పార్లమెం టు సభ్యులే కావడం.. ఇద్దరూ టికెట్ల కోసమే బయటకు రావడం గమనార్హం. అంటే.. `ఒకటికి ఒకటి సమానం` అన్నట్టుగా రెండు పార్టీల్లోనూ జంపింగ్ రాజకీయాలు సాగాయి.
అయితే.. ఈ ఇద్దరు జంపింగులతోనూ రెండు పార్టీలపై ప్రభావం ఎంత? ఎంత మేరకు నష్టం-కష్టం అనేది సహజంగా తలెత్తే ప్రశ్న. కేశినేని నాని వ్యవహారం చూసుకుంటే.. గత రెండేళ్లుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. సొంత నేతలపైనే విమర్శలు చేస్తున్నారు. సో.. ఆయన బయటకు వస్తారని అందరూ ఊహించిందే. కానీ, కర్నూలు ఎంపీ, వైసీపీ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఆయన ఉలుకు పలుకు లేకుండా.. ఉన్నపళాన పార్టీ మారిపోయారు.
కేశినేని నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. పైగావ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడు కూడా. ఆయనకు ఈ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలపైనా పట్టుంది. దీంతో కేశినేని నాని వల్ల టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, తిరువూరు వంటి ఎస్సీ నియోజకవర్గాలపై కేశినేనికి పట్టు ఎక్కువగా ఉంది. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆయన హవా సాగుతోంది. సో.. ఇది వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఇక, కర్నూలు ఎంపీ టికెట్‌ను మంత్రి గుమ్మనూరు జయరాంకు ఖరారు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఉన్నపళం రాజీనామా చేసిన సంజీవయ్య.. 2019 ఎన్నికల్లో వైసీపీ దన్నుతో వెలుగులోకి వచ్చారు. నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో ఆయనకు పెద్దగా పట్టులేదు. సీఎం జగన్ బొమ్మతోనూ.. వైసీపీ జెండాతోనూ.. ఆయన వెలుగులోకివచ్చారు. పార్లమెంటులోనూ ఆయన పెద్దగా గళం వినిపించింది లేదు. అయితే.. బీసీ బోర్డు ఒక్కటే ఆయనకు కలిసి వచ్చే అవకాశం. త్వరలోనేఈయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. మరి ఏమరకు ఆ పార్టీకి మేలు చేస్తారో చూడాలి.