ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయిం చుకున్న జగన్ ప్రభుత్వం ఆమేరకు ముందస్తు వ్యూహంతో వ్యవహరించింది. అయితే.. ఈ సభ నిర్వహణ, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు.. వంటి కీలక అంశాలపై.. ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
సభ ఉద్దేశాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేలా వ్యవహరించారంటూ.. వైసీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. సీఎం..జగన్ను ఆకాశానికి ఎత్తేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు.. గతానికి భిన్నంగా ఉండడం.. నానాటికీ తీసికట్టుగా మారుతున్న అసెంబ్లీ వ్యవహారాలను మరింత దిగజార్చిందని అంటున్నారు.
ఎమ్మెల్యేలకు, మంత్రులకు.. సీఎం జగన్ పట్ల అభిమానం ఉండొచ్చు.. అయితే.. దీనిని వ్యక్తీకరించేందు కు అనేక మార్గాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా సీఎంను కలిసి తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. కానీ, కీలకమైన సభలో.. ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీలో సీఎంను దేవుడని, దైవాంశ సంభూతుడని, దైవ దూత అని .. కొనియాడడం, ఆకాశానికి ఎత్తేయడంవంటి పరిణామాలు.. నిజానికి పార్టీ అభిమానులకు కూ డా మింగుడుపడడం లేదు. ఇంతకన్నా ప్రజలకు చేసిన వారు చాలా మంది ఉన్నారు. రూపాయి జీతం తీసుకుని ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఎవరూ ఇంతలా ప్రజాసమస్య లపై చర్చించాల్సిన సభా వేదికను.. స్వోత్కర్షలకు వేదిక చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని అంటున్నారు.
ఇక, గతంలో ప్రతిపక్షం గొంతు నులిమారని.. అన్న వైసీపీ ఇప్పుడు చేసింది ఏంటి? అనేది కూడా కీలకం గా తెరమీదికి వస్తున్న ప్రశ్న. ప్రతి దానికీ ప్రతిపక్షం యాగీ చేస్తోందని.. అందుకే.. తాము సస్పెండ్ చేశామని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తే.. ఇంత కన్నా ఆత్మహత్యా సదృశం ఉండదు. ఇలా అయితే.. పార్లమెంటు కూడా నడిచే పరిస్థితి ఉండదు. ఉన్న ఆయుధాన్ని ప్రతిసారీ వినియోగిస్తామంటే.. అది అధికార పక్షంవైపు తప్పులు ఎత్తి చూపించే పరిస్థితి ఉంటుంది తప్ప.. ప్రజలకు సరైన సందేశం అయితే ఎప్పటికీ ఇవ్వబోదు. చంద్రబాబు తప్పులు ఎత్తి చూపించేందుకు, జగన్ను ఆకాశానికి ఎత్తేసేందుకు మాత్రమే అసెంబ్లీ నిర్వహించినట్టు సోషల్ మీడియాలోనే కాదు.. సాధారణ ప్రజల్లోనూ ఒక అభిప్రాయం కలుగుతోంది. “ఏముంది.. ఆళ్లని ఈళ్లు తిట్టడం, ఈళ్లు ఆళ్లని తిట్టడమేగా!“ -అని ఒక సామాన్యుడు సైతం అనుకునేలా సభ దిగజారాక ఇక `విలువ` ఎక్కడ?!