- అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్
- లేనేలేదని హైకోర్టు పునరుద్ఘాటన
- దమ్మాలపాటిపై ఏసీబీ కేసు కొట్టివేత
రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా చేయని ప్రయత్నమంటూ లేదు. అక్కడి భూముల క్రయవిక్రయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు, ఊరూపేరూ లేని వైసీపీ నేతలందరూ పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. వారు తమ కారుకూతలు మానడం లేదు. రాజధాని భూముల కొనుగోలుకు సంబంధించి గత ఏడాది సెప్టెంబరు 15న మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత 13(1)(డి)(2), ఐపీసీ 409,420 రెడ్ విత 120బి సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. కేసు నమోదు చేసి తీవ్ర మానసికవేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి తగిన ఫోరంను ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ స్పష్టం చేశారు.
గతంలో కూడా ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని తీర్పు ఇచచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడా చుక్కెదురైంది. అన్ని కోణాల్లో హైకోర్టు అధ్యయనం చేసి మరీ ఈ తీర్పు చెప్పిందని.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు అవకాశమే లేదని.. అక్కడ రాజధాని రానుందన్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ముందే తెలుసని తేల్చిచెప్పింది. దమ్మాలపాటి వ్యవహారం హైకోర్టే తేల్చాలని స్పష్టం చేయడంతో జస్టిస్ మానవేంద్రరాయ్ దీనిపై సమగ్ర విచారణ జరిపి తీర్పు ఇచ్చారు.
ఐపీసీ సెక్షన్లు వర్తించవు..
‘రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన అంశం ఇదివరకే మా ముందు విచారణకు వచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్.. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వ్యవహారం. దానిని కట్టడి చేసేందుకు భారతదేశంలో సెబీ చట్టాన్ని తెచ్చారు.
స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలు, బాండ్లు కొనుగోలు, విక్రయ వ్యవహారం సెబీ పరిధిలోకి వస్తాయి. సెబీ చట్ట నిబంధనలకు ఐపీసీ సెక్షన్లను వర్తింపజేయడానికి వీల్లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది భూముల క్రయ విక్రయాలకు సంబంధం లేని వ్యవహారం.
ప్రైవేటుగా భూములు క్రయవిక్రయాలు చేసిన వారిపై నేరస్థులని ముద్ర వేయడానికి వీల్లేదు. రాజధాని అమరావతి భూములు కొనుగోలు వ్యవహారం ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై ఆయా సెక్షన్ల కింద విచారణ జరపడానికి వీల్లేదు.
ప్రాసిక్యూషన్ వాదన మేరకు దమ్మాలపాటి శ్రీనివాస్ 2014 జూన్ 30 నుంచి 2016 మే 28 అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ)గా పనిచేశారు. రాజధాని ఏర్పాటుపై చర్చించే సమయంలో ఆయన అదే హోదాలో ఉన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో ఏజీకి మాత్రమే చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించే వీలుంటుంది.
రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధమైన విధుల్లో జోక్యం చేసుకోవడానికి దమ్మాలపాటికి వీలుండదు. ఈ నేపఽథ్యంలో రాజధాని ఏర్పాటు గురించి అదనపు ఏజీగా ఉన్న దమ్మాలపాటికి తెలిసే అవకాశం లేదు. అందుచేత రాజధాని నగర ప్రాంతాన్ని గుర్తించడం, ఏపీ సీఆర్డీఏ చట్టం-2014 అమల్లోకి తీసుకొచ్చే ప్రక్రియలో ఆయనకు ఎలాంటి పాత్రా లేదు.
ఏసీబీ నమోదు చేసిన ప్రాథమిక నివేదికలో ఎఫ్ఐఆర్లో సైతం దమ్మాలపాటి రాజధానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం కలిగి ఉన్నారని పేర్కొనలేదు. అప్పటి ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్నందున రాజధాని నగరం ఎక్కడ ఏర్పాటు అవుతుందో ఆయనకు తెలుసన్న ప్రాసిక్యూషన్ వాదనను ఆమోదించలేం.
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం రాజధాని ఏర్పాటు ప్రక్రియలో దమ్మాలపాటి పాత్ర ఉందని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి భూములు కొనుగోలు చేయించి ఉంటారనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నేరపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆర్థిక ప్రయోజనం పొందారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది’ అని తీర్పులో పేర్కొన్నారు.
అదేమీ రహస్యం కాదు..
రాజధాని ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో కృష్ణానది పక్కన ఏర్పాటు అవుతుందనేది గోప్యమైన అంశం కాదని.. ప్రజా బాహుళ్యానికి ముందే తెలుసని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘ ఆస్తులు సంపాదించుకోవడం ప్రజలకు రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కు. రాజ్యాంగంలోని అధికరణ 19(1) ఈ హక్కును కల్పిస్తోంది. భూముల కొనుగోలు రాజ్యాంగం ప్రసాదించిన చట్టబద్ధమైన హక్కు.
విక్రయదారులు స్వచ్ఛందంగా పిటిషనర్లకు భూములను విక్రయించారు. వాటిని రిజస్టర్డ్ దస్తావేజులు ద్వారా పిటిషనర్లు చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేస్తే ఆ చర్యలను నేరపూరితమైన చర్యగా పేర్కొనడం సరికాదు. దస్తావేజులు పరిశీలిస్తే భూయజమానులు భూముల విక్రయానికి ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది.
పిటిషనర్లు రాజధాని గురించి వాస్తవ సమాచారం దాచిపెట్టి భూములు కొనుగోలు చేశారనే ప్రశ్నే తలెత్తదు. పిటిషనర్లకు భూములు విక్రయించడం పై భూయజమానులు ఫిర్యాదు చేయలేదు. భూములతో సంబంధం లేని కొత్త వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ డీఎస్పీ ప్రాథమిక విచారణ జరిపి ఈ వ్యవహారాన్ని కాగ్నిజబుల్ నేరంగా పేర్కొనడం సమర్థనీయం కాదు. ఆ అభిప్రాయానిక ఎలా వచ్చారో ఊహకే అందడం లేదు.
కొంత మంది స్వార్థప్రయోజనాల కోసం తమను వేధించడానికే ఫిర్యాదు చేయించారనే పిటిషనర్ల వాదనలు తోసిపుచ్చలేం. ఊహాజనిత ఆరోపణలతో క్రిమినల్ దర్యాప్తు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా పిటిషనర్లపై కేసు నమోదు చేయడం లక్ష్యం లేకుండా చీకటిలో తుపాకీ పేల్చినట్లుంది. అలా జరగడం వల్ల శబ్దం, అలజడి తప్ప లక్ష్యాన్ని చేధించలేం’ అని పేర్కొన్నారు.
కరకట్టల విధ్వంసానికే!
రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతం రాజధానికి పనికిరాదని, ముంపు ప్రాంతమని నిరూపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. కృష్ణా నది కరకట్టను ధ్వంసం చేసి.. నిజంగానే ముంపునకు గురిచేయాలని భావిస్తోంది.
ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి.. ఇటీవల ఐకానిక్ వంతెన ఆనవాళ్లు లేకుండా చేయడం, రహదారులను తవ్వేయడం వంటి విధ్వంసకర పనులకు పాల్పడుతోంది. తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెం కరకట్ట వెంబడి గోతులు తీసే పనులను ప్రారంభించింది.
ఈ పరిణామం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. కృష్ణానదిలో తవ్వితీసిన(డ్రెడ్జింగ్) ఇసుకను పైపు లైన్ల ద్వారా కరకట్ట వెంబడి ఏర్పాటు చేసే గోతుల్లోకి డంప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. అయితే.. ఈ గోతుల వల్ల.. కరకట్ట బలహీనపడుతుందని, నదికి వరదలు వస్తే.. కరకట్ట తెగిపోయి.. గ్రామాల్లో నీరు చేరుతుందని, దీనిని ఆధారం చేసుకుని ‘రాజధాని ముంపు ప్రాంతం’ అంటూ.. ప్రచారం చేసేందుకే ఇలా చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు.
ఆయా పనులకు ఏఎంఆర్డీఏ అనుమతులు ఇచ్చిందని, అడ్డుకోడానికి వీల్లేదని ఇరిగేషన్ అధికారులు వాదనకు దిగారు. దీంతో ‘‘సీఆర్డీఏ చట్టం అమలులో ఉంది. సీఆర్డీఏ రద్దు బిల్లుపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఏఎంఆర్డీఏ అనుమతి ఎలా ఇస్తుంది’ అని రైతులు, మహిళలు నిలదీశారు. దీనికి సమాధానం చెప్పకుండా ఇరిగేషన్ ఏఈ జనార్దన్ మొండివాదానికి దిగారు.
‘ఈ భూమి రైతులదేనని మీ వద్ద ఆధారాలున్నాయా’ అని ప్రశ్నించారు. రైతులేం తక్కువ తినలేదు. ‘మీరు అధికారి అనేందుకు ఐడెంటిటీ కార్డు ఉందా..? కబ్జాదారులు అనుకోవచ్చుగా’ అని నిలదీశారు. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని, దానిని విస్మరించి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు భూములను ఇసుక డంపింగ్‌కు ఎలా ఇస్తుందని మండిపడ్డారు.
పనులు ఆపకపోతే నిరాహార దీక్ష చేస్తామని రైతులు, మహిళలు హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పక్షాలకు సర్దిచెపే ప్రయత్నం చేశారు. దీంతో ఏఈ జనార్దన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. రెండు నెలల కిందట కూడా ఏఎంఆర్డీఏ అనుమతించిందని చెబుతూ కోల్‌కతా కంపెనీ తాళ్లాయపాలెంలో ఇసుక డంపింగ్ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించింది. రైతులు, స్థానికుల ఆందోళనతో పనులు ఆపేసి ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టింది.
రాజధాని వ్యాజ్యాలపై సర్కారు దొంగాట
రాజధాని వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు నవంబరు 15కి వాయిదా వేసింది. నాటి నుంచి రోజువారీ విచారణ చేపడతామని.. న్యాయవాదుల వ్యక్తిగత కారణాలతో కేసుల విచారణను వాయిదా వేయబోమని స్పష్టం చేసింది. ఎలాంటి అంతరాయం లేకుండా వాదనలు కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో పిటిషనర్లపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలకు దిగింది. వారే వాయిదా కోరారని.. దీనివెనుక దురుద్దేశం కనిపిస్తోందని మంత్రి బొత్స ఆరోపించారు. అయితే నవంబరుకు వాయిదా వేయాలని కోరింది ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామే కావడం గమనార్హం.
పిటిషనర్ల తరఫు న్యాయవాది విచారణను సెప్టెంబరుకు వాయిదా వేయాలని కోరగా.. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘సెప్టెంబరు చివరినాటికి కొవిడ్ మూడవ వేవ్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అక్టోబరులో దసరా సెలవులు ఉన్నందున విచారణను నవంబరుకు వాయిదా వేయాలి’ అని కోరారు. దాంతో కోర్టు నవంబరు 15కి వాయిదా వేసింది.