హుందాగా సాగాల్సిన లైవ్ అందుకు భిన్నంగా రసాభాసగా మారటం.. అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామం షాకింగ్ గా మారింది. మీడియా ముందు.. విలేకరుల సమావేశంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసే రాజకీయ నేతల మాటలకు హద్దులు ఉండవు. ఇటీవల కాలంలో ఈ ధోరణి మరింత పెరిగిపోయింది. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తమ ముందు లేని మనిషిని నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేయటం.. ఆరోపణల్ని గురి పెట్టటం రాజకీయాల్లో మామూలే.
అలాంటిది టీవీ చానల్ లైవ్ లో ఉన్న వేళ.. పక్కన కూర్చొని ఇమేజ్ డ్యామేజ్ చేసేలా మాట్లాడటం.. కాలిపోయే మాటల్ని అనేసిన వైనం ఇప్పుడు రచ్చగా మారింది. ఒక టీవీ చానల్ లో జరిగిన డిబేట్ లో బీజేపీ నేతల విష్ణువర్ధన్ రెడ్డి.. ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికలపూడి శ్రీనివాస్ తో పాటు మరికొందరు పాల్గొన్నారు. ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ నిర్ణయాలతో సహా పలు అంశాలపై చర్చ సాగుతోంది.
చర్చలో భాగంగా ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికలపూడి శ్రీనివాస్ ను ఉద్దేశించి బీజేపీనేత విష్ణు.. ‘పెయిడ్ ఆర్టిస్టు’ అని అన్నారు.
రాజధాని తరలింపుపై తీవ్ర ఆగ్రహంగా ఉండి ఉద్యమం చేస్తుంటే.. పెయిడ్ ఆర్టిస్టు మాటతో తమను కించపర్చటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇలాంటివేళలో బ్యాలెన్సు కోల్పోయిన శ్రీనివాస్.. లైవ్ లోనే చెప్పు తీసి బీజేపీ నేత విష్ణును కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయినా.. ఒక వ్యక్తిని ఉద్దేశించి.. అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మాటలు అనటం ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పాలి.
విష్ణుపై దాడికి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు.. నిజాయితీగా ఉద్యమం చేస్తుంటే.. పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ తమ ఉద్యమాన్ని నీరు కార్చేలా.. అమరావతి పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న వారి త్యాగాల్ని చులకన చేసేలా వ్యాఖ్యలు చేయటం తగదన్నది మర్చిపోకూడదు. నోటికి వచ్చినట్లు మాట్లాడేయటం ఎంత తప్పో తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.