పార్లమెంటు వేదికగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాజ్యసభ చైర్మన్ పోడియంను చుట్టుముట్టి.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో హల్చల్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. దీనిపై చర్చ జరగాలని ఆయన పట్టుబడుతున్నారు.
నిజానికి సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ సమస్యను గత పార్లమెంటు సమావేశాల్లో ఎందుకు లేవనెత్తలేదని.. అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇప్పుడు జాతీయ మీడియా ఆసక్తిగా స్పందించింది. వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన వెనుక `నాటకం` ఉందని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాన్ని వైసీపీ ఎంపీలు చక్కగా అమలు చేస్తున్నారని.. అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి తగినంత మెజారిటీ లేదు. ఈ క్రమంలో ఇతర పార్టీలను హైజాక్ చేయాలంటే..కష్టమే. అలాగని వదిలేస్తే.. తమకు ఇబ్బందులు తప్పవు. కీలకమైన బిల్లులను ఆమోదించుకుని తీరాలి.
ఈ క్రమంలోనే తమ తెరచాటు మిత్రుడు.. జగన్ ద్వారా స్వకార్యం జరిపించుకునేందుకు ఎత్తుగడ వేశారని.. అందులో భాగంగానే రాజ్యసభలో వైసీపీ గతంలో ఎన్నడూ లేని రీతిలో గలాటా చేస్తోందని చెబుతున్నారు. దీనివల్ల వైసీపీకి లాభం ఏంటి? అనే ప్రశ్న తెరమీదికి వస్తుంది. నిజానికి హోదా విషయంలో ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.
సో.. దీనిని వదిలేసి.. అత్యంత కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేసేందుకు వైసీపీ ఎంపీలు గళం వినిపిస్తే.. ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అదేసమయంలో పోలవరం నిధుల విషయంలో నిలదీసినా.. ప్రయోజనం కనిపించే ఛాన్స్ ఉంది.
కానీ.. ఈ విషయాలను పక్కన పెట్టి.. సాధ్యం కాదని తెలిసి కూడా హోదాను ఎంచుకోవడం అంటే.. పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చడమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. “మాకు ఏం రాకపోయినా.. ఫర్వాలేదు. సభ మాత్రం జరగకూడదు“ అనే విధంగా వైసీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారనేది జాతీయ మీడియా వాదనకూడా.
ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా జరుగుతుంటే.. రాజ్యసభలో మోడీ సర్కారు చేయాల్సిన పనులను చేసుకుంటూ పోతోంది. సాయిరెడ్డి దూకుడుతో ఇతర పక్షాలుసైతం నివ్వెర పోతున్నాయి. ఇదే విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలు కూడా పేర్కొంటున్నారు.
వైసీపీ వ్యూహం వెనుక నాటకం ఉందని.. దీనిని త్వరలోనే బయట పెడతామని.. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు సభలో నే చెప్పుకొచ్చారు. అంటే.. రాష్ట్ర ప్రయోజనాల మాటున వైసీపీ మోడీ వ్యూహాన్ని అమలు చేస్తోందన్న మాట. మరి దీనిపై ఏపీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.