“తలెత్తుకోలేకపోతున్నాం సార్.. ఏంటీ నిర్ణయాలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? పరువు పోతోంది సార్. ఎవరికీ ఏమీ చెప్పలేక పోతున్నాం“.. ఇదీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఆసక్తిగా మారిన అంశం. ఏ ఇద్దరు కలిసినా.. ఈ విషయంపై నే చర్చించుకుంటున్నారు.
“మన నాయకుడు చేసే నిర్ణయాలు.. వేసే అడుగులు.. సిల్లీగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయా లను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నాం“ అని ఒకరికొకరు చెప్పుకోవడం.. గమనార్హం. నిజానికి కొన్నాళ్లుగా.. వైసీపీ ప్రజాప్రతినిధులు చాలా మంది ఇదేదోరణిలో ఉన్నారు.
ముందు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం.. దీనిపై వ్యతిరేకత వచ్చిన తర్వాత.. ప్రతిఘటించి.. విమర్శించిన వారిపై దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసలు ఏం చేస్తోందనే చర్చ సాగుతోంది. దీంతో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వారి సన్నిహితుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
“మీ ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటోంది?“ అని దేశ విదేశాల్లోని మిత్రులు, బంధువుల నుంచి కూడా వారికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజాప్రతినిధులు.. అసలు మాకేమీ తెలియదు మీకేం చెప్పలేం అని తప్పించుకుంటున్నారు.
ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజాప్రతినిధులు మరింత ఇరుకున పడ్డారు. ఎందుకంటే.. రెండు సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేశారు. రైతులపై ఉక్కుపాదం మోపారు. అమరావతిని ఏదేదో అన్నారు.
ఇక, ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏకంగా రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. న్యాయ వర్గాలపైనా.. వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయని.. ప్రభుత్వమే సాక్షాత్తూ అసెంబ్లీలో అంగీకరించింది. దీంతో గతం నుంచి తాము ఇదే చెబుతున్నాం.. కదా.. ఇప్పుడు మీరు కళ్లుతెరిచారా? అని ఎమ్మెల్యేల సన్నిహిత వర్గాలు కామెంట్లు చేస్తున్నాయి.
మరోవైపు.. అసలు వచ్చే ఎన్నికల నాటికైనా.. రాజధానులపై సంపూర్ణ అవగాహన వస్తుందా? అనే ప్రశ్న కూడా వైసీపీ నేతలకు ఎదురవుతోంది. లేక.. ఇదేమన్నా.. ఎన్నికల వ్యూహమా? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. దీంతో ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక.. ప్రజలను ఊరడించలేక… సతమతమవుతున్నారు.
ఈ క్రమంలో తలెత్తుకోలేక పోతున్నాం.. సార్! అంటూ.. సహచరుల వద్ద.. తమకు పరిచయం ఉన్న మంత్రుల వద్ద నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. దీనికి మంత్రుల నుంచి కానీ.. తోటి ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కానీ ఎలాంటి సమాధానం లభించకపోవడం గమనార్హం.