వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉంటుందని, ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని సంకేతాలు మొదలైనప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అసహనం మామూలుగా లేదు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకుని.. జగన్ , ఆ పార్టీ నేతలందరిదీ ఒకటే మాట. మేం సింహంలా సింగిల్‌గా వస్తాం.. టీడీపీ, జనసేన పార్టీలకు అంత దమ్ముందా అని సవాల్ చేస్తున్నారు.
ఐతే పొత్తులనేవి ఆయా పార్టీల ఇష్టం. ఎవరు ఎవరితో కలిసినా అభ్యంతర పెట్టడానికి వీల్లేదు. కానీ వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన కలిస్తే అదేదో మహా పాపం అన్నట్లు ప్రచారం చేయడం విడ్డూరం. మాటకు ముందు సింగిల్‌గా రండి.. దమ్ము చూపించండి అని సవాలు విసరడం మరీ విడ్డూరంగా మారింది. తాజాగా సీఎం జగన్ మరోసారి ఇదే మాట అన్నారు. టీడీపీ, జనసేనలకు సవాలు విసిరారు. దీంతో ఆ పార్టీ మద్దతుదారులు కూడా ఇదే వ్యాఖ్యల్ని వల్లె వేస్తూ.. జగన్‌కు ఎలివేషన్లు ఇస్తున్నారు.
ఐతే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పొత్తుల మీద ఆధారపడడాన్ని ఆయన ఫ్యాన్స్ మరిచిపోవడం విడ్డూరమే. 2004లో వామపక్షాలు, టీఆర్ఎస్ పొత్తుతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగలిగారు. తర్వాతి ఎన్నికలప్పుడు విభేదాలు వచ్చి ఆ పార్టీలు దూరం కావడం వేరే విషయం. అప్పుడు కూడా ఆ పార్టీలు కలిసొస్తే కలిసే సాగేవారు వైఎస్. మరి అప్పట్లో పొత్తుల మీద ఆధారపడ్డ వైఎస్‌కు దమ్ములేదని జగన్ అండ్ కో అంటున్నట్లా?
టీడీపీ, జేఎస్పీ విడివిడిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో జగన్ పార్టీకి గొప్ప లాభమే చేకూరింది. ఆ రెండూ కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోయేదని చెప్పలేం కానీ.. అంతటి ఘనవిజయం అయితే దక్కేది కాదన్నది స్పష్టం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను బట్టి చూస్తుంటే.. ఈ రెండు పార్టీలూ కలిస్తే జగన్ కి చాలా కష్టమని ఉండవల్లితో సహా విశ్లేషకులు అందరూ చెబుతున్న మాట వినే ఉంటారుగా.