ఏపీ సీఎం జగన్ మోనార్క్ అని ….ఎవరు చెప్పినా వినరని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ది తుగ్లక్ పాలన అని…ఆయన తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల, మూర్ఘపు చర్యల వల్ల ఏపీ అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. విపక్షాలు కాబట్టి విమర్శించాయిలే అని వైసీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్న తరుణంలో సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తాజాగా విపక్ష నేతల బాటలోకి వచ్చారని తెలుస్తోంది.
నిన్న జరిగిన సుదీర్ఘ కేబినెట్ భేటీలో జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని ….మూర్ఖత్వంలో జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించిపోయారని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. కృష్ణా బేసిన్లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ విధంగా విమర్శలు గుప్పించినట్లు భోగట్టా.
నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ పలు అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక రాష్ట్ర సీఎంగా జగన్కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని, ఇందుకోసం అవసరమైతే కోర్టులకు వెళదామని, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో ధర్నా చేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జగన్ కు చెక్ పెట్టేందుకు తెలంగానలోనూ ఏడెనిమిది ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కూడా కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.