అవి చూడ్డానికి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలే.. కానీ, ఆంధ్రప్రదేశ్లో అవి కవర్ చేస్తున్న నియోజకవర్గాల సంఖ్య 108.
అవి చూడ్డానికి 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలే.. కానీ, ఏపీలో అవి కవర్ చేస్తున్న లోక్సభ నియోజకవర్గాలు 15.
అవి చూడ్డానికి 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లే.. కానీ, అక్కడ పోలయింది 7.16 లక్షల మంది డిగ్రీలు చదువుకున్న, సొంత తెలివితేటలున్నవారి ఓట్లు.
అవి చూడ్డానికి 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లే.. కానీ, అక్కడ గెలిచిన ముగ్గురూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీవారే.
…ఇదీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో కొట్టొస్తున్నట్లు కనిపిస్తున్న విషయం. దీంతో ఇంతవరకు వైనాట్ 175 అంటున్న వైసీపీ నాయకుల నినాదాన్ని టీడీపీ నేతలు అందుకునే పరిస్థితి వస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే 175 నియోజకవర్గాలలో టీడీపీదే గెలుపంటున్నారు కార్యకర్తలు.
రాష్ట్రంలో భౌగోళికంగా భిన్నమైన, సామాజికంగా భిన్నమైన రెండు ప్రాంతాలలో జరిగిన ఈ ఎన్నికలలో చదువుకున్న యువత తెలుగుదేశం పార్టీని ఆదరించారు. పాలక వైసీపీ అభ్యర్థులను ఓడించారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందున్న పాత జిల్లాల పరంగా లెక్కిస్తే రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 9 జిల్లాల పరిధిలో జరిగిన ఎన్నికలవి. అంటే… రాష్ట్రంని దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతంలో జరిగిన ఎన్నికలు.
అంతేకాదు… 108 అసెంబ్లీ, 15 లోక్సభ నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి.
ఈ 108 స్థానాలలో 95 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు… ఈ 15 ఎంపీ సీట్లలో 14 మంది వైసీపీ ఎంపీలే.
*ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం*
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కవర్ చేస్తుంది. శ్రీకాకుళంలోని 10 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నిలలో వైసీపీ 8 చోట్ల గెలిస్తే టీడీపీ రెండే గెలిచింది. విజయనగరంలోని 9 సీట్లూ వైసీపీయే గెలిచింది. విశాఖ జిల్లాలోని 15 సీట్లలో 11 వైసీపీ 4 టీడీపీ గెలిచాయి.
అంటే ఈ మూడు జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ సీట్లలో 2019 ఎన్నికల్లో వైసీపీ 28 గెలుచుకోగా టీడీపీ 6 మాత్రమే గెలిచింది. అంతేకాదు.. ఇక్కడి 5 పార్లమెంటు సీట్లలో శ్రీకాకుళం ఒక్కటి మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా నాలుగూ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.
కానీ, తాజా పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి ఇక్కడ విజయం సాధించారు.
*తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం*
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలున్నాయి. ఇక్కడ 36 అసెంబ్లీ సీట్లు ఉండగా అందులో 2019 ఎన్నికలలో వైసీపీ 31 సీట్లు గెలిచింది. టీడీపీకి దక్కినవి 5 మాత్రమే. ఇక్కడున్న అన్ని లోక్ సభ సీట్లూ వైసీపీయే గెలిచింది.
ప్రకాశం జిల్లాలో 12 సీట్లుంటే 2019లో 8 వైసీపీ, 4 టీడీపీ గెలిచాయి. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లూ వైసీపీయే గెలిచింది. చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో 13 వైసీపీయే గెలిచింది.
కానీ… ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ సునాయాసంగా గెలిచారు.
*పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల సీటు*
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కవర్ చేస్తోంది. ఇక్కడ ఏకంగా 38 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికలలో ఇందులో 36 సీట్లు వైసీపీ గెలిచింది. టీడీపీ 2 మాత్రమే గెలిచింది.
అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలలో 12 వైసీపీ గెలవగా 2 టీడీపీ గెలిచింది. ఇక సీఎం సొంత జిల్లా కడపలో 10కి 10 సీట్లూ వైసీపీయే గెలిచింది. కర్నూలు కూడాఅంతే మొత్తం 14 అసెంబ్లీ సీట్లనూ వైసీపీయే గెలిచింది. ఇక్కడున్న లోక్ సభ సీట్లలో ఒక్కటి కూడా టీడీపీ గెలవలేదు. అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇదంతా 2019 ఎన్నికల ఫలితం.
కానీ.. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచారు.