సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయాలరంగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న కారణంతో తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టుకోవడం కలకలం రేపింది. అయితే, షర్మిల పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని, అందుకే అన్నాచెల్లెళ్లు ఎడమమొహం పెడమొహంగా ఉంటున్నారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ నివాళులర్పించాారు.
వారు వెళ్లిన తర్వాత సాయంత్రం జగన్ వచ్చి నివాళులర్పించారు. సాంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధంగా జగన్ సాయంత్రం పూట నివాళులర్పించారని విమర్శలు వచ్చాయి. ఇక, మొన్నటికి మొన్న రాఖీ పండుగనాడు…కేవలం జగన్ కు ట్విటర్ లో రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టుకున్నారు షర్మిల. దీంతో, వారిద్దరి మధ్య గ్యాప్ అలాగే ఉందని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే రేపు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి సందర్భంగా అన్నాచెల్లెళ్లను కలిపేందుకు వైఎస్ విజయమ్మ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
బుధవారం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకోనున్న జగన్…గురువారం ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొనబోతున్నారు. ఇదే కార్యక్రమానికి షర్మిల కూడా హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. అయితే, జగన్‌తో కలిసి నివాళి అర్పిస్తారా? లేక విడిగా వస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ, తండ్రి వర్ధంతి కావడం వల్ల విజయమ్మతో కలిసి వారిద్దరూ వైఎస్సార్‌కు నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలుస్తోంది.
దీంతో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని….అన్నాచెల్లెళ్లను కలిపేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయాలు వేరని, రక్త సంబంధం వేరని సెంటిమెంట్ తో ఆ ఇద్దరినీ కలిపేందుకు తల్లి విజయమ్మ కట్టిపడేయబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, జగన్ రెండు రోజుల టూర్ లో విజయమ్మ…షర్మిలతో ప్యాచప్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. మరి, విజయమ్మ సెంటిమెంట్ ఫార్ములా…అన్నా చెల్లెళ్లను కలుపుతుందా?అన్నాచెల్లెళ్లు కలిసి నివాళులర్పిస్తారా? లేదా? అన్నది తేలాలంటే వేచి చూడక తప్పదు.